‘దేశం కోసం మీరేం చేశారో చెప్పండి?’

5 Oct, 2018 18:45 IST|Sakshi

సాక్షి, ముంబై: స్వాతంత్ర్య పోరాటంలో గాని.. దేశంకోసం గాని ఆరెస్సెస్‌-బీజేపీ నేతల ఇళ్లల్లోని కనీసం కుక్కయినా చనిపోయిందా అంటూ లోక్‌సభ ప్రతిపక్షనేత మల్లికార్జున ఖర్గే ప్రశ్నించారు. మహారాష్ట్రలో గెలుపే లక్ష్యంగా కాంగ్రెస్‌ పార్టీ అడుగులు వేస్తోంది. దీనిలో భాగంగా అన్ని నియోజకవర్గాల్లో జన సంఘర్ష్‌ యాత్ర పేరిట ర్యాలీలు, సభలు ఏర్పాటు చేస్తోంది. సెప్టెంబర్‌లో తొలి దశలో భాగంగా పశ్చిమ మహారాష్ట్రను కవర్‌ చేసిన కాంగ్రెస్‌, రెండో దశలో ఉత్తర మహారాష్ట్రలో యాత్ర చేపట్టునుంది. దీనిలో భాగంగా జన సంఘర్ష్‌ యాత్ర రెండో దశను జల్గాన్‌ జిల్లాలో మల్లిఖార్జున ఖర్గే శుక్రవారం ప్రారంభించారు. అనంతరం ప్రజలనుద్దేశించి చేసిన ప్రసంగం ఆయన మాటల్లోనే. (మరో స్వాతంత్య్ర పోరాటం)
 
ఒక్కరైనా జైలుకు వెళ్లారా?
‘దేశం కోసం త్యాగాలు చేసింది కాంగ్రెస్ పార్టీయే. దేశ సమైక్యత కోసం ఇంధిరా గాంధీ తన జీవితాన్ని త్యాగం చేశారు. రాజీవ్‌ గాంధీ దేశం కోసం తన జీవితాన్నే అంకితం చేశారు. మరి మీ(ఆరెస్సెస్‌, బీజేపీ) వైపు ఎవరున్నారు. దేశం కోసం త్యాగం చేసిన నేతలు ఎవరున్నారు. స్వాతంత్ర్యం కోసం, దేశం కోసం ఆరెస్సెస్, బీజేపీకి చెందిన వారు ఒక్కరైనా జైలుకు వెళ్లారా?కనీసం వారి ఇంటిలోని కుక్కయినా దేశం కోసం చనిపోయిందా?. మహాత్మాగాంధీ సమాజంలో సామరస్యం, శాంతి కోసం తన ప్రాణాలను త్యాగం చేశారు, కేంద్ర ప్రభుత్వంలోని మోదీ, ఇతరులు మాత్రం మహాత్ముడి సిద్ధాంతాలకు పూర్తి వ్యతిరేకంగా పనిచేస్తున్నారు. గాంధీజీ ఏ సిద్ధాంతాల కోసమైతే తన ప్రాణాలను అర్పించారో అవే సిద్ధాంతాలకు వ్యతిరేకంగా మోదీ ప్రతిరోజు పనిచేస్తున్నారు.’అంటూ ఖర్గే తీవ్ర స్థాయిలో ద్వజమెత్తారు.

ఈ ఏడాది ఫిబ్రవరిలో కూడా ఖర్గే లోక్‌సభలో ఇవే వ్యాఖ్యలు చేశారు. దీనికి జవాబుగా ప్రధాని మోదీ కాంగ్రెస్ స్వాతంత్ర్య సమర యోధులైన భగత్ సింగ్, చంద్రశేఖర్ ఆజాద్ ల పాత్రను ఎప్పుడూ గుర్తు చేసుకోదు. కేవలం ఒక కుటుంబం మాత్రమే దేశానికి స్వాతంత్ర్యం తెచ్చిందని చెబుతుందని కౌంటర్ ఇచ్చారు. (మళ్లీ ఎన్డీయేనే.. కానీ..!)

మరిన్ని వార్తలు