అందుకే ‘చాయ్‌వాలా’  ప్రధాని అయ్యారు..!

9 Jul, 2018 09:30 IST|Sakshi
కాంగ్రెస్‌ సీనియర్‌ నేత మల్లికార్జున ఖర్గే

సాక్షి, ముంబై : కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, మహారాష్ట్ర కాంగ్రెస్‌ ఇన్‌చార్జి మల్లిఖార్జున ఖర్గే ప్రధాని నరేంద్ర మోదీపై విమర్శలు గుప్పించారు. ఆదివారం పార్టీ కార్యకర్తలతో సమావేశమైన ఖర్గే.. బీజేపీ ప్రభుత్వం అసమర్థత వల్లే రైతు ఆత్మహత్యలు పెరిగాయని విమర్శించారు. రైతుల కోసం ప్రవేశపెట్టిన ఒక్క పథకం సరిగ్గా అమలు కావడం లేదని ఆయన ఆరోపించారు. 43 ఏళ్ల క్రితం విధించబడిన ఎమర్జెన్సీ గురించి మోదీ చాలా మాట్లాడుతున్నారు.. మరి నాలుగేళ్లుగా దేశంలో నెలకొన్న అప్రకటిత ఎమర్జెన్సీ గురించి ఎందుకు నోరు విప్పడం లేదని ప్రశ్నించారు. 

కాంగ్రెస్‌ పార్టీ ప్రజాస్వామ్యాన్ని కాపాడినందు వల్లే మోదీ వంటి చాయ్‌వాలా దేశ ప్రధాని కాగలిగారని ఖర్గే వ్యాఖ్యానించారు. 70 ఏళ్ల పాలనలో కాంగ్రెస్‌ పార్టీ దేశానికి ఏం చేసిందంటూ పదే పదే ప్రశ్నిస్తున్న మోదీ ఇప్పటికైనా ఈ విషయాన్ని గుర్తిస్తే మంచిదన్నారు. కేవలం కాంగ్రెస్‌ పార్టీని విమర్శించినంత మాత్రాన ఓట్లు పడవని ఎద్దేవా చేశారు. ఇందిరా గాంధీ, రాజీవ్‌ గాంధీ, సోనియా గాంధీల వ్యక్తిత్వాల గురించి బీజేపీ ఉద్దేశపూర్వకంగానే విమర్శల దాడికి దిగుతోందన్నారు. మోదీ ప్రభుత్వం ప్రచార కార్యక్రమాల కోసం ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేస్తోందన్న ఖర్గే.. బీజేపీని తరిమికొట్టినపుడే ప్రజలకు మంచి రోజులు వస్తాయన్నారు.  

‘మహా’  గెలుపే కీలకం
ఆదివారం జరిగిన పార్టీ కార్యకర్తల సమావేశంలో మహారాష్ట్ర కాంగ్రెస్‌ కమిటీ ‘ప్రాజెక్ట్‌ శక్తి’  యాప్‌ను లాంచ్‌ చేసింది. ఈ సందర్భంగా ఖర్గే మాట్లాడుతూ..కాంగ్రెస్‌ పార్టీ ఒక కుటుంబం, పార్టీ కార్యకర్తలంతా ఈ కుటుంబంలోని సభ్యులు కాబట్టి విభేదాలను పక్కనపెట్టి కలిసి ముందుకు సాగాలని సూచించారు. మహారాష్ట్రలో గెలిచినట్లైతే కచ్చితంగా పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ విజయం సాధిస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. అందుకోసం కార్యకర్తలు నిరంతరం పాటుపడాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించారు. 

>
మరిన్ని వార్తలు