రాష్ట్రంలో మరో నిజాం పాలన: భట్టి

18 Sep, 2018 02:28 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: నాడు నిజాం నిరంకుశ పాలన నుంచి తెలంగాణకు విముక్తి కల్పిస్తే.. ఇప్పుడు మరో నిజాం రూపంలో కేసీఆర్‌ నియంత పాలన చేస్తున్నారని టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు మల్లు భట్టివిక్రమార్క విమర్శించారు. తెలంగాణ ప్రజల పోరాటం, ఆత్మగౌరవ స్ఫూర్తికి భిన్నంగా పాలన సాగుతోందన్నారు. ప్రజాస్వామ్య ముసుగులో నాటి నియంతలను పొగుడుతూ స్వేచ్ఛ, స్వాతంత్య్రాలను అణగదొక్కుతూ దుర్మార్గపు పాలన సాగిస్తున్నారని దుయ్యబట్టారు.

సోమవారం గాంధీభవన్‌లో టీపీసీసీ ముఖ్య నేత వినయ్‌కుమార్, మాజీ ఎమ్మెల్యేలు కొండేటి శ్రీధర్, అనిల్‌లతో కలసి ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. నాటి త్యాగాల చరిత్ర వృథా కాకుండా ఉండాలంటే ఆత్మగౌరవం, ఆత్మాభిమానం, నిధులు, వనరుల కోసం మరోసారి ఉద్యమం చేయాల్సిన సమయం ఆసన్నమైందని చెప్పారు. గడీలు కూల్చిన తెలంగాణలో నయా గడీల నిర్మాణం జరుగుతోందని, రాష్ట్రంలో రాజ్యాంగమే ప్రశ్నార్థకంగా మారిందన్నారు.

రైతులకు బేడీలు వేసి నడిపిస్తున్నారని, దళితులను చిత్రహింసలకు గురిచేస్తున్నారని, గిరిజన మహిళలను కొడుతున్నారని, గురువులు కావాలని అడిగిన విద్యార్థులను కంచె వేసి నిర్బంధించారని, గొంతెత్తిన కళాకారులను కనబడకుండా చేస్తున్నారని, గాయకుల ఇళ్లు ఖాళీ చేయించి నడిబజారులో నిలబెడుతున్నారని దుయ్యబట్టారు. పొడుస్తున్న పొద్దు మీద అంటూ తెలంగాణ గళాన్ని ఎలుగెత్తి చాటిన గద్దర్‌ లాంటి నేతల ఆలోచనలను కనబడనీయకుండా చేస్తున్న ఈ నియంత పాలనకు చరమగీతం పాడాలని పిలుపునిచ్చారు. ఈ ప్రయాణంలో తమతో కలసి రావాలని గద్దర్, విమలక్క, సుధాకర్‌ లాంటి ప్రజాహక్కుల నేతలను కోరుతున్నామన్నారు. మహాకూటమిని నడిపించేది కాంగ్రెస్సేనని, తామే నేతృత్వం వహిస్తామని ఓ ప్రశ్నకు సమాధానంగా భట్టి చెప్పారు.  

మరిన్ని వార్తలు