అమరుల ఆశయాలు నెరవేరుస్తాం

6 Oct, 2018 02:18 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్ర సాధన ఉద్యమ ఆకాంక్షలు, అమరుల త్యాగాలను టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ తన స్వార్థం కోసం ఉపయోగించుకున్నారని టీపీసీసీ ఎన్నికల ప్రచార కమిటీ చైర్మన్‌ మల్లుభట్టి విక్రమార్క ఆరోపించారు. తెలంగాణ కోసం ఆత్మబలిదానాలు చేసిన ఉద్యమకారులు ఆశించిన ఫలితాలు రాష్ట్రంలో రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు.

శుక్రవారం గాంధీభవన్‌లో ఆయన తెలంగాణ అమరవీరుల కుటుంబాల రాష్ట్ర ఐక్యవేదిక నాయకులతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా అమరవీరుల కుటుంబాల పరిస్థితులను అడిగి తెలుసుకున్న ఆయన తాము అధికారంలోకి రాగానే అమరుల కుటుంబాలను ఆదుకుంటామని హామీనిచ్చారు. అమరవీరులు ఆశించిన ఫలితాలు రావాలన్నా, నీళ్లు, నిధులు నియామకాలు దక్కాలన్నా కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి రావడమే మార్గమని అన్నారు.  

ప్రజాప్రభుత్వం తీసుకువస్తాం
60 ఏళ్ల కిందట సమసిపోయిన బాంచన్‌దొర సంస్కృతిని మళ్లీ తెచ్చిన ఘనత కేసీఆర్‌కే దక్కుతుందని ఎద్దేవా చేశారు. ఈ నాలుగేళ్లలో టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం కొత్తగా ఒక్క ఎకరాకు నీళ్లు ఇవ్వలేదని భట్టి ఆరోపించారు. ఉద్యోగాలు కావాలని అడిగిన పాపానికి ఉస్మానియా విద్యార్థులను జైల్లో పెట్టడంతో పాటు వర్సిటీ చుట్టూ కంచె వేసి ఓపెన్‌ జైల్‌గా మార్చారని విమర్శించారు. నాలుగేళ్లలో ఒక్క భారీ ప్రాజెక్టు కట్టకున్నా ఖజానా మొత్తం ఖాళీ అయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ పరిస్థితుల్లో మార్పు తీసుకురావడంతో పాటు ప్రజల అవసరాలే అజెండాగా ప్రజా ప్రభుత్వాన్ని తీసుకువస్తామని భట్టి చెప్పారు.  


‘కూకట్‌పల్లి సీటు కాంగ్రెస్‌కే కేటాయించాలి’
సాక్షి, హైదరాబాద్‌: కూకట్‌పల్లి సీటు కాంగ్రెస్‌కే కేటాయించాలని ఆ పార్టీ శ్రేణులు పీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌కుమార్‌రెడ్డికి విజ్ఞప్తి చేశాయి. శుక్రవారం కూకట్‌పల్లి నుంచి పెద్ద ఎత్తున కార్యకర్తలు గాంధీభవన్‌కు తరలి వచ్చి ఆందోళన నిర్వహించారు.

కూకట్‌పల్లిలో టీడీపీకి అభ్యర్థి లేకున్నా బయటి వ్యక్తిని తీసుకొచ్చి పోటీ చేయించే ప్రయత్నం జరుగుతోందని కార్యకర్తలు ఆరోపించారు. పొత్తులో భాగంగా కూకట్‌పల్లి అసెంబ్లీ సీటును కాంగ్రెస్‌కు కేటాయిస్తే భారీ మెజారిటీతో గెలిపిస్తామని ధీమా వ్యక్తం చేశారు. స్థానికుల్లో ఎవరికీ టికెట్‌ ఇచ్చినా ఇబ్బంది లేదని చెప్పారు. ఇప్పటికే టీఆర్‌ఎస్‌ నేతలు ఇబ్బందులు పెడుతున్నారని, కాంగ్రెస్‌కు కేటాయించకుంటే అధికార పలుకుబడితో తమని భవిష్యత్తులో మరిన్ని ఇబ్బందులకు గురిచేసే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. 

>
మరిన్ని వార్తలు