‘కేసీఆర్‌ మాట్లాడిన తీరు ఆశ్చర్యం కలిగించింది’

25 Oct, 2019 17:26 IST|Sakshi

హుజూర్‌నగర్‌లో గెలుపు అనంతరం కేసీఆర్‌ మితిమీరి మాట్లాడుతున్నారు

కేసీఆర్‌ నిజస్వరూపం నిన్న స్పష్టంగా తెలిసింది

ముఖ్యమంత్రిపై సీఎల్పీ నేత విక్రమార్క విమర్శలు

సాక్షి, హైదరాబాద్‌ : ఆర్టీసీ కార్మికుల సమ్మెపై సీఎం కేసీఆర్‌ వ్యాఖ్యలు ఆశ్చర్యాన్ని కలిగించాయని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అన్నారు. హుజూర్‌నగర్‌ ఉప ఎన్నిక ఫలితం అనంతరం కేసీఆర్‌ మితిమీరి మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ..  ‘ఆర్టీసీ సమ్మెపై సీఎం కేసీఆర్ మాట్లాడిన తీరు ఆశ్చర్యానికి గురిచేసింది. సమ్మె కార్మికుల హక్కు. అధికార అహంభావం కేసీఆర్ ప్రతి మాటలో కొట్టొచ్చినట్లు కనిపించింది. ప్రజా శ్రేయస్సు కోసం ఆలోచిస్తున్నట్టు సీఎం మాటల్లో కనిపించలేదు. అణగారిన వర్గాల్ని తొక్కేసే ఫ్యూడల్ విధానం కేసీఆర్‌ ప్రతి మాటలో కనిపించింది. ఒక్క హుజూర్‌నగర్‌ విజయంతో సీఎం మితిమీరి మాట్లాడారు. 

కేసీఆర్‌ నిజస్వరూపం నిన్న స్పష్టంగా తెలిసింది. కడుపుకాలి కార్మికులు సమ్మెకు వెళ్తే పనికిమాలిన సమ్మె అంటారా. ఆర్టీసీ కేసీఆర్ సృష్టించింది కాదు. దశాబ్దాల నుంచి కొనసాగుతున్న సంపద. టీఆర్‌ఎస్ ప్రభుత్వం రాష్ట్రాన్ని ఇప్పటికే తాకట్టు పెట్టింది. ఇకనైనా అప్పులు, తాకట్టు పెట్టడం ఆపండి. న్యాయస్థానాలు అంటే కేసీఆర్‌కు లెక్కలేదా. కోర్టు చాలా హుందాగా చెప్పింది.. 28లోపు సమస్య పరిష్కారమైందని చెప్తారని ఆశిస్తున్నామంది. సీఎం కోర్టులనైనా గౌరవించి ఆర్టీసీ సమస్యను పరిష్కరించాలి. తెలంగాణ ప్రజలు ఇప్పటికైనా మేల్కోవాలి. తెలంగాణ సాదించుకుంది ఉన్న ఆస్తులను మరింత పెంచుకోవడానికి. అమ్ముకోవడానికి కాదు.’అని హితవు పలికారు.

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు