రేపటి నుంచి కాంగ్రెస్‌ ప్రజాస్వామ్య పరిరక్షణ యాత్ర

18 May, 2019 12:13 IST|Sakshi
మాట్లాడుతున్న భట్టి విక్రమార్క

సాక్షి, రంగారెడ్డి జిల్లా: హస్తం గుర్తుపై గెలిచి.. టీఆర్‌ఎస్‌లో చేరిన ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో కాంగ్రెస్‌ పార్టీ ప్రజాస్వామ్య పరిరక్షణ యాత్రకు శ్రీకారం చుట్టింది. జిల్లాలో ఇటీవల గులాబీ గూటికి చేరిన ఎమ్మెల్యే పట్లోళ్ల సబితా ఇంద్రారెడ్డి ప్రాతినిథ్యం వహిస్తున్న మహేశ్వరం నియోజకవర్గం నుంచి ఈ యాత్రను ప్రారంభించాలని కాంగ్రెస్‌ నిర్ణయించింది. సీఎల్పీ నేత భట్టి విక్రమార్క సారథ్యంలో ఈనెల 19, 20 తేదీల్లో యాత్ర జరగనుంది. అలాగే ఎల్బీనగర్‌ నియోజకవర్గంలోనూ తర్వలో యాత్ర చేపట్టే అంశాన్ని పార్టీ పరిశీలిస్తోంది. ఇక్కడి ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి కూడా కాంగ్రెస్‌ పార్టీ తరఫున ఎమ్మెల్యేగా గెలిచి టీఆర్‌ఎస్‌కు దగ్గరైన విషయం తెలిసిందే. మహేశ్వరం నియోజకవర్గంలో యాత్ర ముగిశాక ఎల్బీనగర్‌ అసెంబ్లీ సెగ్మెంట్‌ పరిధిలోనూ యాత్ర చేపట్టే అవకాశముందని కాంగ్రెస్‌ పార్టీ నేతలు చెబుతున్నారు. 

ఆర్‌కేపురం నుంచి ప్రారంభం 
ఆదివారం పట్టణ ప్రాంతంలో, సోమవారం గ్రామీణ ప్రాంతంలో యాత్ర సాగనుంది. 19న ఆర్‌కేపురం డివిజన్‌లో ఉదయం 9 గంటలకు యాత్ర ప్రారంభవుతుంది. అక్కడే బహిరంగ సభను నిర్వహిస్తారు. బడంగ్‌పేట, మీర్‌పేటలో సాయంత్రం వరకు పర్యటించి సాయంత్రం 5 గంటలకు జిల్లెల్‌గూడలో నిర్వహించే బహిరంగ సభలో భట్టి విక్రమార్క ప్రసంగిస్తారు. మరుసటి రోజు నియోజకవర్గ కేంద్రమైన మహేశ్వరంలో యాత్ర ఉదయం మొదలవుతుంది. స్థానికంగా బహిరంగ సభ నిర్వహించి కందుకూరు మండలంలోకి చేరుకుంటుంది. ఇక్కడ సాయంత్రం 5 గంటలకు జరిగే సభతో యాత్ర ముగుస్తుంది. ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, డీసీసీ అధ్యక్షుడు చల్లా నర్సింహారెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు మల్‌రెడ్డి రంగారెడ్డి, కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి తదితరులు యాత్రలో పాల్గొంటారు.

>
మరిన్ని వార్తలు