రాష్ట్రంలో నియంత పాలన 

30 Apr, 2019 10:39 IST|Sakshi

కేసీఆర్‌ అరాచకాలను సాగనివ్వం  

పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలకు బుద్ధి చెప్పాలి

సీఎల్పీ నేత భట్టి విక్రమార్క

పినపాక నియోజకవర్గంలో ప్రజాస్వామ్య పరిరక్షణ యాత్ర

అశ్వాపురం/పినపాక/కరకగూడెం : ప్రజాస్వామ్యం, రాజ్యాంగం అంటే లెక్క లేకుండా కోట్ల రూపాయల ప్రజాధనాన్ని దోపిడీ చేస్తూ రాష్ట్రంలో సీఎం కేసీఆర్‌ నియంత పాలన సాగిస్తున్నారని కాంగ్రెస్‌ శాసనసభాపక్ష నాయకుడు మల్లు భట్టివిక్రమార్క విమర్శించారు. ప్రజాస్వామ్య పరిరక్షణ యాత్రలో భాగంగా సోమవారం ఆయన అశ్వాపురం, పినపాక, కరకగూడెం మండలాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కాంగ్రెస్‌ పార్టీ గుర్తుపై రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి.. ఇప్పుడు మోసం చేసి పార్టీ మారిన స్థానిక ఎమ్మెల్యే రేగా కాంతారావుకు ప్రజలే తగిన బుద్ధి చెప్పాలన్నారు.

ఓట్లేసిన ప్రజల ఆదరాభిమానాలనుకేసీఆర్‌ దగ్గర తాకట్టు పెట్టారని, ధైర్యం ఉంటే ఎమ్మెల్యే పదవీకి రాజీనామా చేసి ప్రజాతీర్పు కోరాలని హితవు పలికారు. ప్రజా సమస్యలపై ప్రశ్నించే కాంగ్రెస్‌ పార్టీ అసెంబ్లీలో లేకుండా చేయాలనే కుట్రతో ముఖ్యమంత్రి కేసీఆర్‌ అవినీతి సొమ్ముతో సంతలో కూరగాయల్లా ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తున్నారని ఆరోపించారు. రాజ్యాంగం ప్రకారం ఒక పార్టీ గుర్తుపై గెలిచిన ఎమ్మెల్యే పార్టీ మారాలంటే ఆ పదవికి రాజీనామా చేయాలని, ఒకవేళ వారు రాజీనామా చేయకుంటే స్పీకర్‌ శాసనసభ సభ్యత్వాలను రద్దు చేయాల్సి ఉంటుందని అన్నారు. కానీ రాష్ట్రంలో నేడు ఇవేమీ కనిపించడం లేదన్నారు. ఏదేమైనా కేసీఆర్‌ అరాచక పాలనను సాగనివ్వబోమని చెప్పారు.

రాష్ట్రంలో జరుగుతున్న అవినీతిని గణాంకాలతో బయటపెడుతున్న ప్రతిపక్ష నాయకులను అరెస్టు చేయడం కేసీఆర్‌ అహంకారానికి నిదర్శనమని విమర్శించారు. ఇటీవల విడుదలైన ఇంటర్‌  ఫలితాల్లో అనేక అక్రమాలు జరిగాయని, దీంతో ఫెయిలైన విద్యార్థులు ఎంతోమంది ఆత్మహత్య చేసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.  దీనికి ప్రభుత్వ వైఫల్యమే కారణమని, బాధ్యులైన వారిపై చర్య తీసుకోవాలని, విద్యాశాఖ మంత్రిని పదవి నుంచి తొలగించాలని డిమాండ్‌ చేశారు. త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలలో కాంగ్రెస్‌ తరపున పోటీ చేసిన జెడ్పీటీసీ, ఎంపీటీసీ అభ్యర్థులను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఆయన వెంట భద్రాచలం, ములుగు ఎమ్మెల్యేలు పొదెం వీరయ్య, సీతక్క, జిల్లా పరిషత్‌ మాజీ చైర్మన్‌ చందా లింగయ్య, నాయకులు చందా సంతోష్, జెడ్పీటీసీ అభ్యర్థులు గాదె పుష్పావతి, కె.అన్నపూర్ణ, ఎంపీటీసీ అభ్యర్థులు పోరెడ్డి విజయలక్ష్మి, బొగ్గం నాగమణి, నాయకులు గాదె కేశవరెడ్డి, నేలపట్ల సత్యనారాయణరెడ్డి, ఓరుగంటి భిక్షమయ్య, నజీర్‌షోను, తూము వీరరాఘవులు,  అక్కిరెడ్డి సంజీవరెడ్డి, రుక్నారావు,  ఊకే రామనాథం, తొలెం నాగేశ్వరరావు, చిట్టిబాబు, కమలాకర్, మదార్‌సాహెబ్, టీడీపీ, సీపీఐ, సీపీఎం నాయకులు తుళ్లూరి ప్రకాష్‌రావు, అనంతనేని సురేష్, ఎంఏ.గఫార్‌ పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు