ఇసుక మాఫియాకు కేంద్రంగా భద్రాచలం: భట్టి

18 Apr, 2018 15:42 IST|Sakshi
మీడియాతో మాట్లాడుతున్న మల్లు భట్టి విక్రమార్క, ఆయన పక్కన ఉత్తమ్‌, షబ్బీర్‌ అలీ

సాక్షి, భద్రాచలం : ఒకప్పుడు భద్రాచలం అంటే సీతారామచంద్ర ప్రభువు, భక్త రామదాసు గుర్తుకు వచ్చేవారని ప్రస్తుతం ఇసుక మాఫియా కేంద్రంగా మారిపోయిందని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లు భట్టి విక్రమార్క విమర్శించారు. ప్రజాచైతన్య యాత్రలో భాగంగా బుధవారం ఆయన తమ పార్టీ నాయకులతో కలిసి భద్రాచలంలోని సీతారామచంద్ర స్వామి వారిని దర్శించుకున్నారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. కాంగ్రెస్‌ ప్రభుత్వం భద్రాచలం అభివృద్ధికి ఎంతో కృషి చేసిందన్నారు. ఇప్పుడు గోదావరి నది మీద నిర్మించిన బ్రిడ్జి మొదలు వాజేడు వద్ద కొత్తగా కట్టిన బ్రిడ్జిని కూడా కాంగ్రెస్ ప్రభుత్వమే నిర్మించిందని గుర్తుచేశారు. ఈ పరిసర ప్రాంతాల్లో ప్రవహించే శబరి నది మీద హైడల్ ప్రాజెక్టు, దానికి కింద భాగంలో శబరి-గోదావరి కలిసే ప్రాంతంలో దుమ్ముగూడెం ఇందిరాసాగర్ ప్రాజెక్టుకు రూపకల్పన చేసి 80 శాతం నిర్మాణాన్ని పూర్తి చేసింది తమ పార్టీనేనని చెప్పారు.

ఇందిరా సాగర్ ప్రాజెక్టును పూర్తిగా చంపేసి ఈ ప్రాంత ప్రయోజనాలను కేసీఆర్ సర్కార్ చావుదెబ్బ తీసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్.. ముంపు మండలాలను అప్పనంగా ఆంధ్రకు అప్పగించారని నిప్పులు చెరిగారు. చివరకు అన్యాయంగా ఆంధ్రలో కలిపిన అయిదు గ్రామాల గురించి కూడా ప్రధానితో కేసీఆర్ మాట్లాడింది లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. విలేకరుల సమావేశంలో భట్టి విక్రమార్కతో పాటు తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి, శాసనమండలి ప్రతిపక్షనేత షబ్బీర్ అలీ ఇతర కాంగ్రెస్ సీనియర్ నాయకులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు