మాల్యా కేసు : టాప్‌ సీబీఐ ఆఫీసర్‌పై ఆరోపణలు

15 Sep, 2018 20:16 IST|Sakshi
విజయ్‌ మాల్యా (ఫైల్‌ ఫోటో)

న్యూఢిల్లీ : లిక్కర్‌ కింగ్‌ విజయ్‌ మాల్యా వ్యవహారంలో ఒక్కొక్కరూ బుక్కవుతున్నారు. తాను దేశం విడిచి పారిపోవడం అరుణ్‌ జైట్లీకి తెలుసని మూడు రోజుల క్రితం విజయ్‌ మాల్యా వెల్లడించగా.. సీబీఐ అధికారుల అలసత్వం ప్రదర్శించడంతోనే మాల్యా పరారైనట్టు నిన్న సీనియర్‌ సుప్రీంకోర్టు న్యాయవాది దుష్యంత్‌ దావే ఆరోపించారు. తాజాగా సీబీఐ జాయింట్ డైరెక్టర్ ఏకే శర్మ వల్లే విజయ్ మాల్యా దేశం విడిచి పారిపోగలిగాడని కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ ఆరోపిస్తున్నారు. మాల్యా కోసం ఇచ్చిన లుక్ ఔట్ నోటీసులను ఆయన బలహీనపరిచే పారిపోయేందుకు కారణమయ్యారని రాహుల్ శనివారం ట్వీట్ చేశారు.ఇదే అధికారి నీరవ్ మోదీ, మెహుల్ చోస్కీల పరారీ ప్రణాళికల కోసం పని చేశారని రాహుల్ ఆరోపించారు.  ప్రధాని మోదీ ఎంతో ప్రత్యేకంగా చూసే శర్మ గుజరాత్ కేడర్ అధికారని విపక్ష నేత విమర్శించారు. వూప్సూ... ఇన్వెస్టిగేషన్‌ అంటూ రాహుల్‌ ట్వీట్‌ చేశారు.  

అయితే ఈ ఆరోపణలను సీబీఐ కొట్టిపారేసింది. అవన్నీ నిరాధారమని పేర్కొంది. ‘సీబీఐ సీనియర్‌ అధికారులపై కొంతమంది వ్యక్తులు నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారు. ఆయన్ను అరెస్ట్‌ చేయడానికి లేదా అదుపులోకి తీసుకోవడానికి అప్పటికీ సీబీఐ వద్ద అవసరమైన ఆధారాలు లేవు. ఆ కారణంతోనే మాల్యాకు వ్యతిరేకంగా జారీ చేసిన లుక్‌ అవుట్‌ నోటీసును మార్చాలని నిర్ణయం తీసుకున్నాం’ అని సీబీఐ అధికార ప్రతినిధి చెప్పారు.  హై ప్రొఫైల్, వివాదాస్పదమైన కేసులో ప్రధాని ఆమోదం లేకుండా లుక్ ఔట్ నోటీసులను సీబీఐ మార్చడం ఎలా సాధ్యమని రాహుల్ సంధించిన ప్రశ్నలపై సీబీఐ అధికారి ఈ విధంగా స్పందించారు. 

నీరవ్‌ మోదీ, మెహుల్‌ చోక్సి వ్యవహారంపై కూడా స్పందించిన సీబీఐ అధికార ప్రతినిధి... ‘వారు దేశం విడిచి పారిపోయిన నెల తర్వాత సీబీఐకు నీరవ్‌, చోక్సిల విషయంపై పీఎన్‌బీ నుంచి ఫిర్యాదు పొందింది. వారు దేశం విడిచి పారిపోవడానికి సీబీఐ అధికారి కారణం అనడానికి ఎలాంటి ఆధారం లేదు. బ్యాంక్‌ నుంచి ఫిర్యాదు పొందిన వెంటనే, సీబీఐ చర్యలు తీసుకోవడం ప్రారంభించింది’ అని తెలిపారు. ఏకే శర్మ ప్రస్తుతం అదనపు డైరెక్టర్‌ విభాగం, అవినీతి నిరోధక యూనిట్‌లలో పనిచేస్తున్నారు. ఎంతో కీలకమైన కేసుల మాత్రమే ఆయన చూసుకుంటారు. శర్మ, గుజరాత్‌ కేడర్‌కు చెందిన ఐపీఎస్‌ ఆఫీసర్‌. 

మరిన్ని వార్తలు