అడ్వర్టయిజ్‌మెంట్లకు డబ్బులు ఇచ్చినందుకు..

10 Jun, 2019 16:32 IST|Sakshi

బీజేపీ నేతలపై మండిపడ్డ మమతా బెనర్జీ

కోల్‌కతా : కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత బెంగాల్‌లో ఉద్రిక్తతలు రెచ్చగొట్టడమే ధ్యేయంగా బీజేపీ ప్రయత్నాలు ముమ్మరం చేసిందని పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి, తృణమూల్‌ కాంగ్రెస్‌ అధినేత్రి మమతా బెనర్జీ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో అస్థిరత సృష్టించాలన్న వారి కుట్రలను భగ్నం చేస్తామని పేర్కొన్నారు. బెంగాల్‌లోని ఉత్తర 24 పరగణాల జిల్లాలో టీఎంసీ, బీజేపీ శ్రేణుల మధ్య ఘర్షణ చెలరేగిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. దీంతో బీజేపీ, టీఎంసీ నేతలు పరస్పరం విమర్శల యుద్ధానికి దిగుతున్నారు. అంతేకాక బెంగాల్‌లో శాంతి భద్రతలు పరిరక్షించడంలో మమత ప్రభుత్వం విఫలమైందంటూ కేంద్ర హోంశాఖ విమర్శించింది.

ఈ నేపథ్యంలో సోమవారం మమతా బెనర్జీ మీడియాతో మాట్లాడుతూ..‘వాళ్లు బెంగాల్‌ను మరో గుజరాత్‌ చేయాలనుకుంటున్నారు. కానీ ఇదేమీ గుజరాత్‌ కాదు. ఉత్తరప్రదేశ్‌లో చిన్న పిల్లలు హత్యకు గురవుతున్నారు. అలాంటివి మా రాష్ట్రంలో ఎంతమాత్రం ఉపేక్షించము. బీజేపీ గెలిచిన తర్వాత బెంగాల్‌లో అల్లర్లను ప్రోత్సహిస్తోంది. ఆ పార్టీకి చెందిన జాతీయ నాయకులు కొంతమంది మాపై కుట్రలు చేస్తున్నారు. కానీ మేమెప్పుడూ వారికి తలవంచబోము’ అని బీజేపీ తీరుపై మండిపడ్డారు. అదేవిధంగా మీడియా కూడా ఘర్షణలకు సంబంధించిన వార్తలను ప్రసారం చేసేటప్పుడు కాస్త బాధ్యతాయుతంగా వ్యవహరించాలని హితవు పలికారు. ‘కేవలం ఇద్దరు కార్యకర్తలు మరణిస్తే.. నలుగురు చనిపోయారంటూ మీడియా ప్రసారం చేస్తోంది. అడ్వర్టైజ్‌మెంట్లకు బీజేపీ డబ్బులు ఇస్తుంది కాబట్టి వారికి అనుకూలంగా వార్తలు ప్రసారం చేయడం సరైంది కాదు’ అని మమత విమర్శలు గుప్పించారు. కాగా ఉత్తర 24 పరగణలో చెలరేగిన అల్లర్లలో తమ పార్టీకి చెందిన ఐదుగురు కార్యకర్తలు మరణించారని బీజేపీ ఆరోపిస్తుండగా..టీఎంసీ మాత్రం కేవలం ఇద్దరు కార్యకర్తలే చనిపోయారనడం గమనార్హం.

మరిన్ని వార్తలు