సీఏఏపై కేంద్రానికి మమత సవాలు

20 Dec, 2019 11:11 IST|Sakshi

కోల్‌కతా : పౌరసత్వ సవరణ చట్టానికి(సీఏఏ) వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఆందోళనలు కొనసాగతున్న వేళ పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సంచలన వ్యాఖ్యలు చేశారు. కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. గురువారం మమత మాట్లాడుతూ.. బీజేపీకి దమ్ముంటే సీఏఏ, ఎన్నార్సీపై ఐకరాజ్య సమితి పర్యవేక్షణలో ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టాలని సవాలు విసిరారు. ఈ రెఫరండంలో బీజేపీ ఓటమి పాలైతే అధికారం నుంచి తప్పుకోవాలన్నారు. స్వాతంత్య్రం వచ్చి ఇన్నేళ్లయిన తర్వాత.. ఇప్పుడు భారత పౌరులుగా నిరూపించుకోవాలా అని ప్రశ్నించారు.

నిరసనల ముసుగులో బీజేపీ కార్యకర్తలే ఆస్తులను ధ్వంసం చేస్తున్నారని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం సీఏఏను ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేశారు. కాగా, సీఏఏకు వ్యతిరేకంగా నిరసన చేపడుతున్న మమతపై బీజేపీ నేతలు తీవ్ర విమర్శలు చేస్తున్న నేపథ్యంలోనే.. ఆమె ఈ విధంగా స్పందించినట్టుగా తెలుస్తోంది. మరోవైపు సీఏఏకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఆందోళనలు కొనసాగుతున్నాయి. దేశంలోని పలు ప్రాంతాల్లో 144 సెక్షన్‌ విధించారు. కొన్ని  సమస్యాత్మక ప్రాంతాల్లో ఇంటర్నెట్‌ సేవలను నిలిపివేశారు.  కర్ణాటక మంగళూరులో పోలీసుల కాల్పుల్లో ఇద్దరు ఆందోళనకారులు చనిపోయారు. 

>
మరిన్ని వార్తలు