‘కాంగ్రెస్‌ నిర్లక్ష్యం వల్లే బీజేపీ గెలిచింది’

4 Mar, 2018 08:44 IST|Sakshi
పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ (ఫైల్‌ ఫోటో)

కోల్‌కతా : తృణమూల్‌ కాంగ్రెస్‌ అధినేత్రి, పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈశాన్య రాష్ట్రాల ఫలితాలపై స్పందించే క్రమంలో బీజేపీతోపాటు కాంగ్రెస్‌ పార్టీపైనా ఆమె విమర్శలు చేశారు. కాంగ్రెస్‌ నిర్లక్ష్యం మూలంగానే బీజేపీ గెలిచిందని ఆమె వ్యాఖ్యానించారు.

‘బీజేపీని ఓడించేందుకు ప్రాంతీయ పార్టీలను కలుపుకునిపోవాలనికాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌కు నేను సూచించా. కానీ, కాంగ్రెస్‌ పార్టీ నా మాట వినలేదు. ఫలితం ఘోర పరాభవం చవిచూడాల్సి వచ్చింది. ఒకవేళ కాంగ్రెస్‌ సరైన పోరాటం చేసి ఉంటే కనీసం 10 స్థానాలైనా దక్కి ఉండేవి. కాంగ్రెస్‌ నిర్లక్ష్యమే వారిని దెబ్బ తీసింది. అదే బీజేపీకి ఆయువును అందించింది. వారు ఎవరి మాట వింటారో అర్థం కావట్లేదు. సొంత తప్పిదాలతోనే వారు వరుసగా ఎన్నికల్లో బోల్తాపడుతున్నారు’ అని ఆమె వ్యాఖ్యానించారు. 
 
ఇక ఒడిశా, పశ్చిమబెంగాల్‌, కర్ణాటక, కేరళ రాష్ట్రాల్లో కూడా అధికారంలోకి వస్తే ఇక బీజేపీకి స్వర్ణయుగమే అని బీజేపీ చీఫ్‌ అమిత్‌ షా వ్యాఖ్యలను ఉద్దేశిస్తూ మమత విరుచుకుపడ్డారు. ‘ఫించాలు పెట్టుకున్న బొద్దింకలు(బీజేపీని ఉద్దేశించి) తాము నెమళ్లు అయిపోయినట్లు కలలు కంటున్నాయి. 2019 సార్వత్రిక ఎన్నికల గెలుపు కల ఎన్డీయే కూటమికి పెద్ద శరాఘాతమే అవుతుంది. కేంద్రంలోని అధికారాన్ని అడ్డుపెట్టుకుని.. యథేచ్ఛగా డబ్బు వెదజల్లి బీజేపీ అధికారంలోకి వచ్చింది. త్రిపురలో వామపక్ష పార్టీకి-బీజేపీకి కేవలం 5 శాతం ఓటింగ్‌ మాత్రమే తేడా వచ్చింది. అంత మాత్రానికే కమల పార్టీ నేతలు గప్పాలు కొట్టుకోవాల్సిన అవసరం లేదు’అని ఎద్దేవా చేశారు.

మరిన్ని వార్తలు