‘ర్యాలీలతో దేవుడి పేరు చెడగొడుతున్నారు’

26 Mar, 2018 17:10 IST|Sakshi

సాక్షి, కోల్‌కతా: శ్రీరామ నవమి పర్వదినం సందర్భంగా నిర్వహించే ర్యాలీలతో శ్రీరాముడి పేరును చెడగొడుతున్నారంటూ పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. శ్రీరామ నవమి రోజు ర్యాలీల సందర్భంగా జరిగే మత ఘర్షణలపై సోమవారం ఆమె మీడియాతో మాట్లాడారు. ఆయుధాలతో శోభాయాత్రలు జరపాలని దేవుడు ఎవరికైనా చెప్పారా అంటూ ఆమె ప్రశ్నించారు. కొంత మంది అవివేకులు ఆయుధాలతో ర్యాలీలు చేస్తూ దేవుడి పేరు చెడగొడుతున్నారని ఆమె మండిపడ్డారు.

శాంతీయుతమైన ర్యాలీలకు మాత్రమే తాను అనుమతి ఇస్తానని, ఆయుధాలతో ఇతరుల ఇంట్లోకి వెళ్లి హత్యచేసే ర్యాలీలకు అనుమతి ఇచ్చే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. రాష్ట్రంలో మత పరమైన ర్యాలీలు నిర్వహించినప్పుడు ఘర్షణలు జరుగుతున్న విషయం తెలిసిందే. కాగా, గతేడాది దుర్గ మాత శోభాయాత్ర, మొహర్రం పండుగలు ఒకే రోజున వచ్చినప్పుడు కూడా సీఎం మమతా బెనర్జీ చాకచక్యంగా వ్యవహరించి మత ఘర్షణలు జరగకుండా జగ్రత్తలు తీసుకున్నారు. మన దేశంలో సాధారణంగా సిక్కు మతస్థులు ఆయుధాలతో ర్యాలీలు నిర్వహించడం చూస్తుంటాం. అయితే మత పరమైన ర్యాలీలలో కత్తులు, తుపాకులతో ప్రదర్శనలు నిర్వహించడం చట్టరీత్యా నేరం.

>
మరిన్ని వార్తలు