మమతా బెనర్జీ మెగా ర్యాలీ

19 Jan, 2019 12:35 IST|Sakshi

కోల్‌కతా : లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో బీజేపీయేతర పార్టీలను ఏకతాటిపైకి తెచ్చేందుకు పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ చేపట్టిన భారీ బహిరంగ సభ ప్రారంభమైంది. కోల్‌కతాలోని బ్రిగేడ్‌ పరేడ్‌ గ్రౌండ్‌లో జరుగుతున్న ఈ సభకు కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ మద్దతు తెలపగా.. వివిధ ప్రాంతీయ పార్టీలకు చెందిన నేతలు హాజరయ్యారు. యూపీ మాజీ సీఎం అఖిలేశ్‌ యాదవ్‌(ఎస్పీ), డీఎంకే చీఫ్‌ స్టాలిన్‌, బీజేపీ మాజీ మంత్రి అరుణ్‌ శౌరి, బీజేపీ మాజీ నేత యశ్వంత్‌ సిన్హా, బీజేపీ రెబల్‌ నేత శతృఙ్ఞ సిన్హా, లోక్‌తంత్ర్‌ జనతాదళ్‌ చీఫ్‌ శరద్‌ యాదవ్‌, ఎన్సీపీ అధినేత శరద్‌ పవార్‌, ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌, కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి, ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు,ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్‌,  ఎన్సీ నేత ఒమర్‌ అబ్దుల్లా, ఫరూఖ్‌ అబ్దుల్లా తదితరులు ‘యునైటెడ్‌ ఇండియా బ్రిగేడ్‌’  ర్యాలీలో భాగస్వాములయ్యారు. వీరితో పాటుగా పటేల్‌ హక్కుల నేత హార్ధిక్‌ పటేల్‌, జిగ్నేష్‌ మేవానీ వంటి యువ నేతలు కూడా సభ వేదికపై చేరుకున్నారు.

ప్రజాస్వామ్యాన్ని రక్షించడానికే : యశ్వంత్‌ సిన్హా
‘యునైటెడ్‌ ఇండియా బ్రిగేడ్‌’ ర్యాలీకి హాజరైన ప్రజలను ఉద్దేశించి బీజేపీ మాజీ నేత యశ్వంత్‌ సిన్హా ప్రసంగిస్తూ.. ‘ కేవలం నరేంద్ర మోదీని గద్దె దించేందుకు మేమంతా ఒక్కటి కాలేదు. మోదీ సిద్ధాంతాలకు మాత్రమే మేం వ్యతిరేకం. ఎన్డీయే హయాంలో ప్రజాస్వామ్యం అపహాస్యమైంది. ప్రజా సమస్యలపై చర్చించేందుకు, ప్రజాస్వామ్యాన్ని రక్షించేందుకే మేమంతా ఏకతాటిపైకి వచ్చాం’ అని పేర్కొన్నారు.

బీజేపీ ప్రజలను మోసం చేసింది : అరుణ్‌ శౌరీ
‘బీజేపీలాగా ప్రజలను మోసం చేసిన ప్రభుత్వం ఇంకొకటి లేదు. కర్ణాటకలో ఏం జరుగుతుందో మనం చూస్తున్నాం. మధ్యప్రదేశ్‌లో కూడా ఇలాగే జరగవచ్చు. కాబట్టి నాయకులంతా జాగ్రత్తగా ఉండాలి. బీజేపీ వ్యవస్థలన్నింటినీ నాశనం చేసి, భ్రష్టు పట్టించింది. 2019 ఎన్నికల్లో బీజేపీని ఓడించాలి’ అని బీజేపీ మాజీ మంత్రి అరుణ్‌ శౌరీ పేర్కొన్నారు.

మోదీ పాలనలో కశ్మీర్‌ తగులబడిపోతోంది : ఫరూఖ్‌ అబ్దుల్లా
‘ఎంతో మంది ప్రాణ త్యాగాలతో దేశానికి స్వాతంత్ర్యం వచ్చింది. కానీ ఇప్పుడు బీజేపీ రూపంలో దేశానికి మరో పెద్ద ఆపద వచ్చి పడింది. మోదీ పాలనలో కశ్మీర్‌ తగులబడిపోతోంది. మతం పేరుతో దేశాన్ని విభజిస్తున్నారు. దేశాన్ని కాపాడుకునేందుకు నేతలు బలిదానాలకు సిద్ధం కావాలి. ఎన్నికల్లో బీజేపీయేతర పార్టీలు గెలవాలంటే ఈవీఎంలను నిషేధించాలి. మళ్లీ పేపర్‌ బ్యాలెట్‌ నమూనా ప్రవేశపెట్టాలి. ప్రధాని ఎవరు కావాలన్నది ప్రస్తుతానికి వదిలేద్దాం. ముందు బీజేపీని గద్దె దించుదాం’ అని నేషనల్‌ కాన్ఫరెన్స్‌ అధినేత ఫరూఖ్‌ అబ్దుల్లా వ్యాఖ్యానించారు.

మోదీని ఇంటికి సాగనంపాలి : స్టాలిన్‌
డీఎంకే చీఫ్‌ స్టాలిన్‌ మాట్లాడుతూ.. ‘స్వాత్రంత్యం కోసం ఇది మరో పోరాటం. బీజేపీని గద్దె దింపాలి. మోదీని ఇంటికి సాగనంపాలి. మనమంతా ఐక్యంగా ఉంటేనే ఇది సాధ్యపడుతుంది’ అని పేర్కొన్నారు.

అన్ని వర్గాల ప్రజలు దగాపడ్డారు : జిగ్నేష్‌ మేవానీ
‘బీజేపీ పాలనలో యువత, రైతులు, దళితులు, ఆదివాసీలు, పేదలు ఇలా అన్ని వర్గాల ప్రజలు దగాపడ్డారు. దళితులపై అకృత్యాలు పెరిగాయి. బీజేపీ- ఆరెస్సెస్‌ అరాచక సిద్ధాంతాలను అంతమొందించేందుకు మమతా దీదీ బీజేపీయేతర పార్టీలను ఒకే వేదికపైకి తీసుకురావడం చాలా సంతోషంగా ఉంది. మహా కూటమి అధికారంలోకి రాగానే సెక్యులర్‌ భావజాలాన్ని పెంచి అన్ని వర్గాలకు న్యాయం చేస్తుంది. రైతుల ఆత్మహత్యలు ఆగుతాయి. అందుకోసం మనమంతా కలిసి ఒకటిగా పోరాడాల్సిన అవసరం ఉంది’ అని గుజరాత్‌ ఎమ్మెల్యే జిగ్నేష్‌ మేవానీ వ్యాఖ్యానించారు.

విద్వేషాలను రెచ్చగొడుతున్నారు : అఖిలేశ్‌ యాదవ్‌
‘బీజేపీ దేశంలో విద్వేషాలను రెచ్చగొడుతోంది. ప్రతిపక్షాలను భయపట్టేందుకు బీజేపీ దర్యాప్తు సంస్థలతో దోస్తీ కడితే.. మేం ప్రజలతో కలిసి కూటమిగా ఏర్పడుతున్నాం. తమిళనాడులో బీజేపీ జీరో అయినట్టే మిగతా రాష్ట్రాల్లో కూడా కావాలి’ అని యూపీ మాజీ సీఎం, ఎస్పీ అధినేత అఖిలేశ్‌ అన్నారు.

మోదీ ఐదేళ్లలోనే చేసి చూపించారు: కేజ్రీవాల్‌
భారతదేశాన్ని విడగొట్టాలని పాకిస్తాన్‌ 70 ఏళ్లుగా ఎదురుచూస్తోంది. కానీ ప్రధాని మోదీ కేవలం ఐదేళ్లలోనే దేశాన్ని విడగొట్టారు. విద్వేషాలను రెచ్చగొట్టి కుల, మత ప్రాతిపదికన ప్రజలను విడదీశారు. మోదీ- అమిత్‌ షాలను తరిమికొట్టేందుకే సమూహంగా ఏర్పడ్డాం.

మరిన్ని వార్తలు