మేమొస్తే నోట్లరద్దుపై దర్యాప్తు

28 Mar, 2019 04:09 IST|Sakshi
మేనిఫెస్టోను విడుదల చేస్తున్న మమత

మేనిఫెస్టో విడుదల చేసిన టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ

కోల్‌కతా: వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో ప్రతిపక్ష కూటమి అధికారంలోకి వస్తే బీజేపీ హయాంలో చేపట్టిన నోట్లరద్దుపై విచారణ చేయిస్తామని తృణమూల్‌ కాంగ్రెస్‌ అధినేత్రి, పశ్చిమబెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రకటించారు. మోదీ ప్రభుత్వం రద్దు చేసిన ప్రణాళికా సంఘాన్ని పునరుద్ధరిస్తామని హామీ ఇచ్చారు. బుధవారం ఇక్కడ ఆమె పార్టీ ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేశారు. ఉపాధి హామీ పథకం అమలును ఏడాదిలో 100 రోజుల నుంచి 200 రోజులకు పెంచుతామనీ, అలాగే కూలీని రెట్టింపు చేస్తామని ప్రకటించారు. వస్తుసేవల పన్ను(జీఎస్టీ) విధానం ప్రజలకు వాస్తవంగా ఉపయోగపడుతుందా లేదా అనే దానిపై నిపుణులతో సమీక్ష చేపడతామన్నారు. పెద్ద నోట్లరద్దుతోపాటు, జీఎస్టీ అమలు ఆర్థిక వ్యవస్థను నాశనం చేశాయని ఆరోపించారు. ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామన్న ఎన్నికల తర్వాత ఏర్పాటయ్యే కొత్త ప్రభుత్వం ఉద్యోగావకాశాల కల్పనపై ప్రత్యేక దృష్టి సారిస్తుందని, మైనారిటీలు, ఎస్‌సీలు, ఎస్‌టీలు, ఓబీసీలకు కేటాయించిన ఉద్యోగాలను భర్తీ చేస్తుందని హామీ ఇచ్చారు.   

అడ్వాణీజీతో మాట్లాడా
‘ఈరోజు బీజేపీ కురువృద్ధ నేత ఎల్‌కే అడ్వాణీజీతో మాట్లాడా. ఆయన ఆరోగ్యం గురించి వాకబుచేశా. నేను ఫోన్‌ చేయడంతో ఆయన ఆనందం వ్యక్తం చేశారు. వ్యవస్థాపక సభ్యులు,  పార్టీకి మూలస్తంభాల్లాంటి వారైన అడ్వాణీ, మనోహర్‌ జోషిలను బీజేపీ అలా ఎందుకు వ్యవహరిస్తోంది. ఇప్పుడు వారిని ఎందుకు వదిలివేసింది? గురువులకు గురుదక్షిణ ఇలా కూడా చెల్లిస్తారా అని ఆశ్చర్యం వేస్తోంది. అయినా, ఆ పార్టీ అంతరంగిక విషయాలపై నేను ఎక్కువగా మాట్లాడదలుచుకోలేదు’ అని మోదీనుద్దేశించి పరోక్షంగా వ్యాఖ్యానించారు.

మరిన్ని వార్తలు