‘మీరు నామినేట్‌ అయ్యారని మరిచిపోకండి’

24 Apr, 2020 11:40 IST|Sakshi

కోల్‌కతా​ : పశ్చిమ బెంగాల్‌ గవర్నర్‌ జగదీప్ ధంఖర్‌పై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను ప్రజల చేత ఎన్నుకోబడి ముఖ్యమంత్రి అయ్యాయని, గవర్నర్‌ కేంద్రం చేత నామినేట్‌ చేయబడ్డారని అన్నారు. గవర్నర్‌ రాష్ట్ర ప్రభుత్వ పాలనలో పదేపదే జోక్యం చేసుకోవడంపై మమత అభ్యంతరం వ్యక్తం చేశారు. రాజ్యాంగ ధర్మాన్ని ఎవరు అతిక్రమిస్తున్నారో సమాధానం చెప్పాలని కోరారు. కరోనా విషయంలో గవర్నర్‌కు, మమతా సర్కార్‌కు మధ్య విబేధాలు చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో మీడియా సమావేశాలు నిర్వహించిన గవర్నర్‌.. మమత సర్కార్‌పై విమర్శలు చేశారు. ఈ నేపథ్యంలోనే గవర్నర్‌కు మమత ఐదు పేజీల లేఖ రాశారు. గవర్నర్‌ వాడుతున్న భాష ముఖ్యమంత్రి కార్యాలయాన్ని అవమానించేలా ఉందని ఆ లేఖలో పేర్కొన్నారు. గవర్నర్‌ అధికారాలు తెలుసుకోవాలని సూచించారు. 

‘నేను గౌరవప్రదమైన భారత రాష్ట్రానికి  ప్రజల చేత ఎన్నుకోబడిన ముఖ్యమంత్రిని..  మీరు నామినేట్‌ చేయబడిన గవర్నర్‌ అనే సంగతి  మర్చిపోయినట్టు ఉన్నారు. గవర్నర్‌ నుంచి వస్తున్న లేఖల్లో వాడుతున్న భాష, సందేశాలు ముఖ్యమంత్రి కార్యాలయాన్ని అవమానించేలా ఉన్నాయి. మీరు నాపై, మంత్రులపై, ప్రభుత్వ అధికారులపై దాడికి దిగుతున్నారు. మీరు మాట్లాడే ధోరణి, భాష అన్‌ పార్లమెంటరీగా ఉంది’అని మమతా లేఖలో పేర్కొన్నారు. అలాగే గవర్నర్‌ అధికారాల మీద బీఆర్‌ అంబేడ్కర్‌, సర్కారీయ కమిషన్‌లు ఇచ్చిన నివేదికలను ఆమె ఈ సందర్భంగా ప్రస్తావించారు. గవర్నర్‌ తరుచూ మీడియా సమావేశాలు ఏర్పాటు చేసి ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడటంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. కాగా, గతేడాది జగదీప్‌ గవర్నర్‌గా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి రాజ్‌భవన్‌, సీఎంఓల మధ్య సత్సబంధాలు అంతగా లేవు. 

కాగా, కరోనా నియంత్రణలో మమత సర్కార్‌ విఫలమైందని పెద్ద ఎత్తున ఆరోపణలు వస్తున్నాయి. దీనిపై బీజేపీ నేతలు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. అలాగే కరోనా కేసుల సంఖ్యను కూడా ప్రభుత్వం దాచిపెడుతుందని కూడా ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం పశ్చిమ బెంగాల్‌లో పరిస్థితిని సమీక్షించడానికి ప్రత్యేక బృందాన్ని పంపింది. దీంతో కరోనాపై బీజేపీ, టీఎంసీల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. కాగా, ప్రస్తుత పరిస్థితులు బెంగాల్‌లో రాజ్యాంగ సంక్షోభానికి దారితీసేలా కనిపిస్తున్నాయి.

మరిన్ని వార్తలు