ఒంటరిగానే పోరాడతాం

10 Jan, 2020 03:55 IST|Sakshi
ఉత్తర 24 పరగణా జిల్లాలో ర్యాలీలో మమత

కాంగ్రెస్, లెఫ్ట్‌ పార్టీలతో కలవబోం

సీఏఏ, ఎన్‌ఆర్‌సీలపై సీఎం మమత

కోల్‌కతా: కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ), ఎన్‌ఆర్‌సీలకు వ్యతిరేకంగా తాము ఒంటరిగానే పోరాడతామని కాంగ్రెస్, లెఫ్ట్‌ పార్టీలతో కలవబోమని పశ్చిమ బెంగాల్‌ సీఎం మమత చెప్పారు. సీఏఏకు వ్యతిరేకంగా పోరాడే అంశంపై ఈ నెల 13న కాంగ్రెస్‌ చీఫ్‌ సోనియా గాంధీ ప్రతిపక్షాలతో నిర్వహిస్తున్న సమావేశానికి తాను వెళ్లట్లేనన్నారు. బెంగాల్‌లో బుధవారం ట్రేడ్‌ యూనియన్లు చేపట్టిన సమ్మెలో కాంగ్రెస్, లెఫ్ట్‌ పార్టీలు పలు హింసాత్మక కార్యకలాపాలకు పాల్పడ్డాయని ఆమె ఆరోపించారు.

ఈ రెండు పార్టీలు పశ్చిమబెంగాల్‌లో ఒకలా, ఢిల్లీలో మరోలా ప్రవర్తిస్తున్నాయని విమర్శించారు. నీచ రాజకీయాలకు పాల్పడుతున్నాయని ధ్వజమెత్తారు. ఈ తరహా ధోరణిని తాను సహించబోనని తేల్చిచెప్పారు. ఈ కారణంతోనే తాను సోనియా గాంధీ సమావేశాన్ని బహిష్కరిస్తున్నట్లు స్పష్టం చేశారు. సీఏఏ చట్టానికి వ్యతిరేకంగా అసెంబ్లీలో తీర్మానాన్ని ప్రవేశపెట్టాలన్న ప్రతిపక్షాల డిమాండ్‌పై ఆమె స్పందించారు. గత సెప్టెంబర్‌లో సీఏఏకు వ్యతిరేకంగా తీర్మానాన్ని ఆమోదించిన నేపథ్యంలో మరోసారి ఆమోదించాల్సిన అవసరం లేదని ఉద్ఘాటించారు. సోనియా సమావేశానికి హాజరుకాకపోవడానికి సంబంధించి ఆమె ఎన్సీపీ చీఫ్‌ శరద్‌ పవార్‌తో మాట్లాడారని తృణమూల్‌ కాంగ్రెస్‌ వర్గాలు వెల్లడించాయి.

మరిన్ని వార్తలు