మమతా బెనర్జీపై బీజేపీ సీఎం తీవ్ర వ్యాఖ్యలు

26 Apr, 2018 11:17 IST|Sakshi
బిప్‌లాబ్‌ కుమార్‌ దేబ్‌.. మమత బెనర్జీ

అగర్తల: బీజేపీ-తృణమూల్‌ కాంగ్రెస్‌ పార్టీల మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరింది. త్రిపుర సీఎం విప్లవ్‌ కుమార్‌ దేవ్‌.. పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీని ఉద్దేశించి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆమెకు మతి చెడిందని.. పిచ్చాసుపత్రిలో చేరాలంటూ విప్లవ్‌ వ్యాఖ్యానించారు. 

‘మమతా బెనర్జీకి మతి చెడినట్లుంది. ఆమె ఆస్పత్రిలో చేరి చికిత్స చేయించుకుంటే మంచిది. ఆమె మాటలు తెలివితక్కువగా ఉన్నాయి’అని విప్లవ్‌ పేర్కొన్నారు. అంతేకాదు గుళ్లూ, గోపురాలు సందర్శిస్తే  ఆమె మానసిక స్థితి బాగుపడొచ్చని వ్యంగ్యంగా మాట్లాడారు. ఈ వ్యాఖ్యలపై టీఎంసీ అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. కాగా, త్రిపుర అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై ఓ ఇంటర్యూలో మమతా బెనర్జీ మాట్లాడుతూ.. ‘బీజేపీవంటి జాతీయ పార్టీ త్రిపుర లాంటి చిన్న రాష్ట్రంలో విజయం సాధించడంలో గొప్పేముందని.. అవి మున్సిపల్‌ ఎన్నికలు’ అని పేర్కొన్నారు. దీంతో విప్లవ్‌ ఆమెకు కౌంటర్‌ ఇచ్చారు.

కాగా, త్రిపురలో రెండున్నర దశాబ్దాల కమ్యూనిస్టుల పాలనకు తెరదించుతూ ఫిబ్రవరిలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. 59 స్థానాలకు జరిగిన ఎన్నికల్లో మొత్తం బీజేపీ 35 సీట్లను కైవసం చేసుకుంది.

మరిన్ని వార్తలు