2 కోట్లు.. ఓ పెట్రోల్‌ బంకు

22 Jul, 2019 04:29 IST|Sakshi
ఆదివారం కోల్‌కతాలో జరిగిన భారీ బహిరంగసభలో ప్రసంగిస్తున్న మమతా బెనర్జీ

తృణమూల్‌ కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలకు బీజేపీ ప్రలోభాలు

పార్టీలో చేరకుంటే జైలుకు పంపుతామంటూ బెదిరింపులు

బీజేపీ తీరుపై ధ్వజమెత్తిన బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ  

కోల్‌కతా: కేంద్ర దర్యాప్తు సంస్థలను అడ్డంపెట్టుకొని తమ పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులను కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం బెదిరిస్తోందని తృణమూల్‌ కాంగ్రెస్‌(టీఎంసీ) అధినేత్రి, పశ్చిమబెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ధ్వజమెత్తారు. తమ పార్టీలో చేరాలని, లేకుంటే కేంద్ర దర్యాప్తు సంస్థలను ప్రయోగించి చిట్‌ఫండ్‌ కుంభకోణంలో జైలుకు పంపిస్తామని టీఎంసీ ప్రజాప్రతినిధులను బీజేపీ భయపెడుతోందని మండిపడ్డారు. ఆదివారం కోల్‌కతాలో అమరవీరుల దినాన్ని పురస్కరించుకొని టీఎంసీ భారీ ర్యాలీ నిర్వహించింది.

రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పార్టీ కార్యకర్తలు భారీగా హాజరైన ఈ ర్యాలీలో ఆమె ప్రసంగించారు. కర్ణాటకలో అనుసరిస్తున్న వైఖరినే రాష్ట్రంలోనూ ప్రయోగించాలని బీజేపీ చూస్తోందని ఆమె విమర్శించారు. దీనికోసం తమ ఎమ్మెల్యేలు ఒక్కొక్కరికి రూ.2 కోట్లతోపాటు పెట్రోల్‌ బంక్‌ ఇస్తామని ప్రలోభపెడుతోందని ఆరోపించారు. తమ పార్టీ గ్రామ నేతలకు రూ.20 లక్షలు ఇస్తామని ఆశ చూపుతోందన్నారు. డబ్బుతో ఎవరినైనా కొనేయగలమనే అహంకారంలో బీజేపీ ఉందని మండిపడ్డారు.

ఇలాగైతే మరో రెండేళ్లే..
2019 లోక్‌సభ ఎన్నికల్లో ఈవీఎంలను మేనేజ్‌ చేసి బీజేపీ గెలిచిందని మమత ఆరోపించారు. ప్రస్తుత తీరుగానే వారి వ్యవహారం ఉంటే మరో రెండేళ్లే కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉంటుందని హెచ్చరించారు. 2021 బెంగాల్‌ అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ పుంజుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు. ప్రభుత్వ పథకాల లబ్ధిదారుల నుంచి టీఎంసీ నాయకులు వసూలు సొమ్మును తిరిగిచ్చేయాలని తాను అన్నట్లుగా తన గత ప్రకటనను బీజేపీ వక్రీకరించిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

పథకాల అమలుపై ఓ కన్నేసి ఉంచాలని తమ పార్టీ నాయకులకి తాను చెప్పానని, అయితే తన మాటలని వక్రీకరించి తమ నాయకులను బీజేపీ భయపెడుతోందని మండిపడ్డారు. ముందు బీజేపీ తరలించిన నల్లధనాన్ని వెనక్కి తీసుకురావాలని, అలాగే ఆ పార్టీ నాయకులు ఉజ్వల పథకంలో వసూలు చేసిన సొమ్మును వెనక్కి ఇవ్వాలన్నారు. ఇదే డిమాండ్‌తో 26వ తేదీన నిరసనలు చేపట్టాలని  కార్యకర్తలకు ఆమె పిలుపునిచ్చారు. ఉచిత ఎల్పీజీ  పేరుతో బీజేపీ నేతలు డబ్బు వసూలు చేయడంపై దర్యాప్తు జరుపుతామన్నారు. 18 లోక్‌సభ స్థానాలు గెలిచి.. మొత్తం రాష్ట్రాన్ని గెలిచేసినట్లుగా బీజేపీ భావిస్తోందని ఎద్దేవా చేశారు. గంటపాటు ర్యాలీలో ఆమె.. ఏ ఒక్క బీజేపీ నాయకుడి పేరు కూడా ప్రస్తావించకపోవడం గమనార్హం.
 

మరిన్ని వార్తలు