ఈసీది ఏకపక్ష నిర్ణయం: మమతా బెనర్జీ

16 May, 2019 12:36 IST|Sakshi

ప్రజాస్వామ్యంపై బీజేపీ దాడి

కోల్‌కతా : తనకు మద్దతుగా నిలిచిన  కాంగ్రెస్‌, బీఎస్పీ, ఎస్పీ, టీడీపీ అధినేతలకు పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి, తృణమూల్‌ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ కృతజ్ఞతలు తెలిపారు. బీజేపీ అధ్యక్షుడు అమిత్‌ షా ర్యాలీ సందర్భంగా  పశ్చిమ బెంగాల్‌లో హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్న విషయం తెలిసిందే. తత్వవేత్త ఈశ్వర్‌చంద్ర విద్యాసాగర్‌ విగ్రహం ధ్వంసం నేపథ్యంలో టీఎంసీ, బీజేపీ పరస్పరం ఆరోపణలకు దిగాయి. అనంతర పరిణామాలతో ఈసీ ఒకరోజు ముందుగానే ఎన్నికల ప్రచారాన్ని కుదిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో తనకు వెన్నుదన్నుగా నిలిచిన రాహుల్‌ గాంధీ, మాయావతి, అఖిలేష్‌ యాదవ్‌, చంద్రబాబు నాయుడు అధినేతలకు మమతా బెనర్జీ కృతజ్ఞత తెలుపుతూ గురువారం ట్వీట్‌ చేశారు. 

బీజేపీ ప్రజాస్వామ్యంపై నేరుగా దాడి చేస్తోందని, ఆ పార్టీకి ప్రజలు తగిన బుద్ధి చెబుతారని ఆమె నిప్పులు చెరిగారు. ఈ ఎన్నికల్లో బీజేపీ తగిన మూల్యం చెల్లించుకుంటుందని మమత విమర్శించారు. ఎన్నికల సంఘం ఏకపక్ష నిర్ణయంపై  అసంతృప్తి వ్యక్తం చేశారు. బీజేపీకి అనుకూలంగా పనిచేస్తూ.. ఈసీ ఏకపక్షంగా పనిచేస్తోందని ఆమె ఆరోపించారు. మరోవైపు పశ్చిమ బెంగాల్‌లో హింసాత్మక ఘటనలపై బీజేపీ ఎన‍్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది.

మరిన్ని వార్తలు