మాట మార్చిన మమత

2 Aug, 2018 22:26 IST|Sakshi

అప్పుడు వెళ్లగొట్టాలని పోరాటం

ఇప్పుడు పంపితే రక్తపాతం అంటూ ఆక్రోశం

రాజకీయాల్లో వివిధ అంశాలపై పార్టీల వైఖరి కూడా సమయానికి అనుగుణంగా మారిపోతూనే ఉంటుంది. దీనికి నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తున్నారు పశ్చిమబెంగాల్‌ ముఖ్యమంత్రి మమత బెనర్జీ. అస్సాం జాతీయ పౌర గుర్తింపు (ఎన్‌ఆర్‌సీ) తుది ముసాయిదా జాబితా విడుదలైనప్పట్నుంచి ఆమె దానిని తీవ్రంగా విమర్శిస్తూ రాజకీయ వివాదానికి తెర తీశారు. ఎన్నికల్లో రాజకీయ ప్రయోజనాల కోసమే బీజేపీ ఎన్‌ఆర్‌సీని వినియోగించుకుంటోందంటూ విరుచుకుపడుతున్నారు. బంగ్లాదేశీయుల్ని దేశం నుంచి వెనక్కి పంపిస్తే అంతర్యుద్ధం చెలరేగి రక్తపాతానికి దారి తీస్తుందని ఆమె హెచ్చరిస్తున్నారు.. ఇప్పుడంటే ఆమె వలసదారులకు మద్దతుగా మాట్లాడుతూ బీజేపీతో ఢీ అంటే ఢీ అంటున్నారు కానీ సరిగ్గా పదమూడేళ్ల కిందట యూపీఏ హయాంలో మమత పార్లమెంటులో వలసదారుల్ని వెళ్లగొట్టాలంటూ గళమెత్తారు. 

పార్లమెంటులో ఏం జరిగిందంటే... 
2005లో విపక్ష ఎంపీగా ఉన్న మమత బెనర్జీ బంగ్లాదేశ్‌ నుంచి అక్రమ వలసలు ఒక విధ్వంసంగా మారాయంటూ పార్లమెంటులో ధ్వజమెత్తారు. ఈ చొరబాట్లు అత్యంత ఆందోళనకర అంశమని, దీనిపై చర్చ జరగాలంటూ  ఒక తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. వారికి ఓటు హక్కు ఉండడంపై కూడా తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేశారు.∙అప్పట్లో లోక్‌సభ స్పీకర్‌గా ఉన్న సీపీఎం నేత సోమనాథ్‌ ఛటర్జీ ఆ తీర్మానాన్ని తిరస్కరించారు. అప్పట్లో పశ్చిమ బెంగాల్‌లో సీపీఎం అధికారంలో ఉండడంతో మమత మరింత చెలరేగిపోయారు. స్పీకర్‌ పక్షపాతంతో వ్యవహరిస్తున్నారంటూ నిప్పులు చెరిగిన ఆమె ఆ సమయంలో సభని నడిపిస్తున్న డిప్యూటీ స్పీకర్‌ చరణ్‌జిత్‌ సింగ్‌ అత్వాల్‌పై తన చేతిలో ఉన్న పేపర్ల కట్ట విసిరికొట్టారు.

మమత ఒక్కసారిగా ఆగ్రహావేశాలు ప్రదర్శించడంతో సభ యావత్తూ నివ్వెరపోయింది. చివరికి ఎంపీ పదవికి కూడా ఆమె రాజీనామా చేశారు. అయితే రాజీనామా సరైన ఫార్మాట్‌లో లేదని దానిని స్పీకర్‌ తిరస్కరించారు. అప్పట్లో బంగ్లాదేశ్‌ ముస్లింలు సీపీఎంకు బలమైన ఓటు బ్యాంకుగా ఉండేవారు. దీంతో మమత వారిపై ఎలాంటి మమతని చూపించలేదు. పైపైచ్చు వారిని రాష్ట్రం నుంచి తరిమికొట్టాలని, వారంతా సామాజిక విధ్వంసులుగా మారుతున్నారంటూ వ్యాఖ్యలు చేశారు. కానీ కాలక్రమంలో బంగ్లా ముస్లింలు తృణమూల్‌ వైపు తిరిగిపోయారు. ఇప్పుడు వారంతా టీఎంసీకి బలమైన ఓటు బ్యాంకుగా ఉన్నారు. అందుకే మమత వారి ప్రయోజనాలను కాపాడడానికి ఎలాంటి పోరాటానికైనా సిద్ధపడుతున్నారని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. 

ర్యాలీ పాలిటిక్స్‌ షురూ 
అస్సాం ఎన్‌ఆర్‌సీ పశ్చిమ బెంగాల్‌లో రాజకీయంగా ప్రకంపనలు సృష్టిస్తోంది. తృణమూల్‌ కాంగ్రెస్, బీజేపీలకు ఇదే ఓటు బ్యాంకు అస్త్రంగా మారింది. పశ్చిమ బెంగాల్‌లో బలం పుంజుకొని వామపక్షాలు, తృణమూల్‌ కాంగ్రెస్‌లకు బలమైన ప్రత్యామ్నాయంగా ఎదగాలని  భావిస్తున్న బీజేపీ ఎన్‌ఆర్‌సీ ప్రాతిపదికగా రాజకీయ వ్యూహాలను రచిస్తోంది. ఆగస్టు 11న కోల్‌కతాలో బీజేపీ తలపెట్టిన యువ ర్యాలీకి తొలుత అనుమతి నిరాకరించిన మమత ఆ తర్వాత వెనక్కి తగ్గి ఓకే చెప్పారు. ఇప్పుడు ఆ ర్యాలీలోనే అక్రమ వలసలపై మమత కప్పదాటు వైఖరిని ఎండగట్టడానికి బీజేపీ సిద్ధమవుతోంది. బంగ్లాదేశ్‌ నుంచి వలస వచ్చిన వారు భారత వనరుల్ని ఎలా దోచుకుంటున్నారో, భద్రతకు వారెంత ముప్పుగా పరిణమించారో జనంలోకి తీసుకువెళ్లడానికి బీజేపీ అధ్యక్షుడు అమిత్‌ షా సన్నాహాలు చేస్తున్నారు. బంగ్లాదేశ్‌ అక్రమ వలసల వ్యవహారం జాతీయ పార్టీలతో పాటు, అసోం, పశ్చిమ బెంగాల్‌లో ప్రాంతీయ పార్టీలకు ఒక ఎన్నికల అంశంగా ఎప్పట్నుంచో ఉంటూ వస్తోంది.. ఇప్పుడు ఈ రెండు పార్టీల మధ్య జరుగుతున్న రసవత్తర రాజకీయం ఏ మలుపు తిరుగుతుందోనని రాజకీయ పరిశీలకులు ఆసక్తిగా చూస్తున్నారు. 

ఎన్‌ఆర్‌సీ దరఖాస్తుల పరిశీలనలో బెంగాల్‌ నత్తనడక
ఎన్‌ఆర్‌సీ జాబితా బయటకి వచ్చిన మరుక్షణం నుంచే మమత బెనర్జీ దానిని ఒక రాజకీయ అస్త్రంగా చేసుకున్నారు కానీ దానిని రూపొందించే సమయంలో తృణమూల్‌ సర్కార్‌ ఎన్‌ఆర్‌సీ అధికారులకు అంతగా సహకరించలేదు. పెళ్లిళ్లు, ఉద్యోగాల నిమిత్తం అసోంలో స్థిరపడిన వారిలో చాలా మంది పశ్చిమ బెంగాల్‌ చెందినవారు కూడా ఉన్నారు. వారి ధ్రువీకరణ పత్రాలు ఎంతవరకు వాస్తవమో పరిశీలించి వెనక్కి పంపాలంటూ ఎన్‌ఆర్‌సీ 1.14 లక్షల మందికి చెందిన డాక్యుమెంట్లను పంపితే, వాటిలో కేవలం 6 శాతాన్ని మాత్రమే పరిశీలించి టీఎంసీ ప్రభుత్వం వెనక్కి పంపింది. పశ్చిమ బెంగాల్‌తో పాటు బిహార్, చండీగఢ్, మణిపూర్, మేఘాలయా వంటి రాష్ట్రాలు డాక్యుమెంట్ల పరిశీలించడంలో విఫలం కావడం కూడా అన్ని లక్షల మందికి జాబితాలో చోటు దక్కకపోవడానికి కారణమైంది.

మరిన్ని వార్తలు