సోనియా, రాహుల్‌కు నేను ముందే చెప్పా!!

25 Apr, 2018 16:04 IST|Sakshi

అభిశంసన తీర్మానంపై మమత ఆసక్తికర వ్యాఖ్యలు

కోల్‌కతా: భారత ప్రధాన న్యాయమూర్తి దీపక్‌ మిశ్రాకు వ్యతిరేకంగా కాంగ్రెస్‌ పార్టీ అభిశంసన నోటీసు ఇవ్వడం తప్పేనని పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అన్నారు. ఈ అభిశంసన నోటీసుకు తమ పార్టీ తృణమూల్‌ కాంగ్రెస్‌ మద్దతు ఇవ్వలేదని ఆమె తెలిపారు. అసలు ఈ నోటీసులు చేపట్టవద్దంటూ కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ, ఆయన తల్లి సోనియాగాంధీకి ముందే తాను సలహా ఇచ్చినట్టు వెల్లడించారు.

‘కాంగ్రెస్‌ మా మద్దతు కోరింది. కానీ మేం ఇవ్వలేదు. అభిశంసనకు వెళ్లకండి అంటూ నేను సోనియా, రాహుల్‌కు చెప్పాను’ అని మమతా ఓ చానెల్‌తో తెలిపారు. న్యాయవ్యవస్థలో తమ పార్టీ జోక్యం చేసుకోబోదని ఆమె తెలిపారు. దుష్ప్రవర్తనకు పాల్పడుతున్నారంటూ సీజేఐకి వ్యతిరేకంగా కాంగ్రెస్‌ పార్టీ ఇచ్చిన అభిశంసన నోటీసుకు ఏడు ప్రతిపక్ష పార్టీలు మద్దతు పలికిన సంగతి తెలిసిందే. ఈ పిటిషన్‌పై 64మంది రాజ్యసభ సభ్యులు సంతకాలు చేశారు. అయితే, కాంగ్రెస్‌ ఆరోపణలకు తగినంతగా ఆధారాలు లేవంటూ.. ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఈ నోటీసును తిరస్కరించిన సంగతి తెలిసిందే.

మరిన్ని వార్తలు