పక్కా ప్రణాళికతోనే ఢిల్లీ అల్లర్లు : దీదీ

2 Mar, 2020 14:08 IST|Sakshi

కోల్‌కత్తా : దేశ రాజధాని ఢిల్లీలో ఇటీవల చోటుచేసుకున్న అల్లర్లపై పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీ అల్లర్ల వెనుక పెద్దకుట్ర దాగిఉందని, దీని వెనక కేంద్ర ప్రభుత్వం హస్తం కూడా ఉందని ఆరోపించారు. పక్కా ప్రణాళిక ప్రకారమే ఈ హత్యాకాండ జరిగిందని కేంద్రంపై విరుచుకుపడ్డారు. అలాగే ఢిల్లీ అ‍ల్లర్లపై పరిశీలనకు ఓ కమిటీని సైతం ఏర్పాటు చేస్తామని, ఘర్షణలు చోటుచేసుకున్న ప్రాంతంలో టీఎంసీ ప్రతినిధులు పర్యటిస్తారని మమత స్పష్టం చేశారు. ఢిల్లీలో జరిగిన ఘర్షణలపై కేంద్ర ప్రభుత్వం ఇప్పటికీ క్షమాపణలు చెప్పకపోవడం బాధాకరమన్నారు. సోమవారం కోల్‌కత్తాలోని నేతాజీ ఇండోర్‌ స్టేడియంలో నిర్వహించిన పార్టీ సమావేశంలో మమత ఈ వ్యాఖ్యలు చేశారు.

కాగా కేంద్ర హోమంత్రి అమిత్‌ షా ఆదివారం కోల్‌కత్తాలో పర్యటించిన విషయం తెలిసిందే. షా పర్యటనపై దీదీ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. బెంగాల్‌లో అల్లర్లు సృష్టించడానికి బీజేపీ నాయకత్వం ప్రయత్నిస్తోందని, ఇదేమీ ఢిల్లీ కాదని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. అమిత్‌ షా బెంగాల్‌ పర్యటన సందర్భంగా బీజేపీ కార్యకర్తలు గోలీమారో నినాదాలు చేయడంపై సీఎం స్పందించారు. హింసను ప్రేరేపించే విధంగా నినాదాలు చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. కాగా ఈ ఘటనలో అనుమానితులుగా భావిస్తున్న ముగ్గురు బీజేపీ కార్యకర్తలను పోలీసులు ఇదివరకే అదుపులోకి తీసుకున్నారు. పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ) వ్యతిరేక, అనుకూల వర్గాల మధ్య జరిగిన ఘర్షణలో 46 మంది పౌరులు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే.


  

మరిన్ని వార్తలు