డ్వాక్రా రుణాలు కట్టొద్దు

10 Apr, 2019 13:01 IST|Sakshi
ర్యాలీ జనానికి అభివాదం చేస్తున్న చెవిరెడ్డి, విష్ణు

జగనన్న మాఫీ చేస్తాడు: చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి

జగనన్న సీఎం కావడం ఖాయం: సినీ నటుడు మంచు విష్ణు

భాకరాపేట: డ్వాక్రా అక్క చెల్లెమ్మలు రుణాలు కట్టొద్దని... జగనన్న ఆ రుణాల మొత్తం మాఫీ చేస్తారని చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి అన్నారు. మంగళవారం చిన్నగొట్టిగల్లు మండలం భాకరాపేటలో జరిగిన భారీ బహిరంగ సభలో ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి మాట్లాడుతూ ఐదేళ్ల కాలంలో టీడీపీ ప్రభుత్వం ఇచ్చిన ఒక్క హామీ అయినా పూర్తిగా అమలు చేశారా? అని ప్రశ్నించారు. మహిళలకు డ్వాక్రా రుణాలు మాఫీ అని చెప్పి మూడు చెక్కులను మూడు ముక్కలు చేసి మహిళలను వంచించారన్నారు. జగనన్న ప్రభుత్వంలో పేదల సొంతంటి కల సాకారం కానుందన్నారు. ఇచ్చిన ప్రతి హామీని జగనన్న  నెరవేరుస్తారన్నారు.  

జగనన్న సీఎం కావడం ఖాయం
జగనన్న ముఖ్యమంత్రి కావడం ఖాయమని సినీ నటుడు మంచు విష్ణు అన్నారు. భాకరాపేట సభలో ఆయన మాట్లాడుతూ, చంద్రబాబును విమర్శంచను.. కానీ ఈ రాష్ట్రంలో రైతులకు మంచి రోజులు రావాలంటే జగనన్న ముఖ్యమంత్రి కావాల్సిందేనన్నారు. ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి అంటే తనకెంతో ఇష్టం అన్నారు. ‘సంక్రాంతికి విద్యానికేతన్‌కు రావాలని పిలిస్తే... సారీ రాలేను ఒక కార్యకర్తను అనవసరంగా జైల్లో పెట్టారు. ఆ ఇంట్లో పండుగ లేదు కాబట్టి నేను కూడా పోలీస్‌ స్టేషన్‌ వద్దనే ఉంటాను అన్నారు’ అని తెలిపారు. ఇలాంటి నాయకుడు ఈ రాష్ట్రంలో ఉండరని అన్నారు. ప్రజల కోసం పరితపించే నాయకుడు చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డిని అఖండ మెజారిటీతో గెలిపించాలని అభ్యర్థించారు. 

చిన్నగొట్టిగల్లు అభివృద్ధికి కృషి
చిన్నగొట్టిగల్లు మండలాన్ని అభివృద్ధి చేయడానికి అహర్నిశలు శ్రమిస్తానని చెవిరెడ్డి చెప్పారు. చిన్నగొట్టిగల్లు చెరువు సప్లయ్‌ ఛానల్‌ వెడల్పుతో పాటు, లైనింగ్‌ పనులు చేపట్టడం, అలాగే దేవరకొండ నుంచి దీన్‌దార్లపల్లె వద్ద ఉన్న చెరువులను అనుసంధానం చేయడం, చిన్నగొట్టిగల్లు ఆస్పత్రిని అభివృద్ధి చేసి పేదలకు అందుబాటులోకి మెరుగైన వైద్య సేవలను తీసుకురావడం, గ్రామీణ రోడ్లను పూర్తి చేయడం, అర్హులుగా ఉండి ఇళ్లు లేని వారికి ఇళ్లు ఇప్పించడం, భాకరాపేట, చిన్నగొట్టిగల్లు అభివృద్ధికి ప్రత్యేక చొరవ తీసుకుంటానని హామీ ఇచ్చారు.

అంబులెన్స్‌కు దారి వదలండి
అయ్యా.. అన్నా... అక్కా... అంబులెన్స్‌కు దారి వదలండంటూ చెవిరెడ్డి ప్రజలను కోరారు. ఆపదలో ఉన్న వారిని ఆదుకునే అంబులెన్స్‌కు ఎక్కడ ఉన్నా ఎటువంటి సందర్భమైనా దారి వదలాలి ఓ ప్రాణాన్ని కాపాడాలన్న మన వైఎస్‌ఆర్‌ మాటకు విలువిద్దాం అని చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి చెప్పగానే కార్యకర్తలు అంబులెన్స్‌ ముందు సైనికుల్లాగా దారికి అడ్డుగా ఉన్న కార్యకర్తలను పక్కకు పంపించారు.

మరిన్ని వార్తలు