దశాదిశా లేని టీడీపీలో ఉండలేను..

29 Mar, 2019 07:09 IST|Sakshi
ప్రగతిభవన్‌లో బుధవారం కేటీఆర్‌ను కలిసిన కార్పొరేటర్‌ మందడి శ్రీనివాసరావు చిత్రంలో ఎమ్మెల్యే కృష్ణారావు

కేపీహెచ్‌బీ కార్పొరేటర్‌ మందడి శ్రీనివాసరావు  

రాజకీయాల్లోంచి తప్పుకుంటున్నట్లు ప్రకటన  

కేపీహెచ్‌బీకాలనీ:  నిజాయితీ రాజకీయాలు చేయాలని, ప్రజలకు సేవలందించాలని రాజకీయాల్లోకి వచ్చాను.. కార్పొరేటర్‌గా గెలిపించిన ప్రజలకు సేవలందించేందుకు మూడు సంవత్సరాలుగా నిస్వార్థంగా పనిచేశాను. అయితే తెలంగాణలో తెలుగుదేశం పార్టీ మనుగడ ప్రశ్నార్థకంగా మారింది.. కనీసం పార్లమెంట్‌ ఎన్నికల్లో పోటీ కూడా చేయలేని దుస్థితి.. దశాదిశా లేని నాయకత్వం తీరు బాధాకరం.. ఇక తెలుగుదేశం పార్టీలో కొనసాగలేనంటూ కేపీహెచ్‌బీకాలనీ డివిజన్‌ కార్పొరేటర్‌ మందడి శ్రీనివాసరావు సోషల్‌ మీడియాలో చేసిన పోస్టు కలకలం రేపింది. గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌లో ఏకైక టీడీపీ కార్పొరేటర్‌గా గుర్తింపు పొందిన మందడి శ్రీనివాసరావు కూకట్‌పల్లి నియోజకవర్గంలో టీడీపీకి పెద్దదిక్కుగా మారారు. అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్‌ కేటాయించకపోవడం, పార్లమెంట్‌ ఎన్నికల్లో పార్టీకి పోటీచేసే సత్తా కూడా లేకపోవడం, రోజురోజుకూ దిగజారుతున్న నాయకత్వం తీరుతో పార్టీని వీడేందుకు నిర్ణయించుకొని సోషల్‌ మీడియాలో పోస్టు చేసినట్లు తెలిసింది. అయితే బుధవారం మధ్యాహ్నం కూకట్‌పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావుతో కలిసి కేటీఆర్‌ను కలవడంతో టీఆర్‌ఎస్‌లో చేరనున్నారనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి.

అయితే రాత్రికి రాత్రి తాను తెలుగుదేశం పార్టీ విధానాలపై, నాయకుల తీరుపై ఆవేదన చెంది పార్టీని, పదవిని వీడుతున్నట్లు ప్రకటించారు. మూడేళ్లక్రితం కేపీహెచ్‌బీకాలనీ డివిజన్‌లో టీడీపీ అభ్యర్థిగా పోటీచేసిన మందడి శ్రీనివాసరావు టీఆర్‌ఎస్‌ అభ్యర్థిపై గెలుపొంది గ్రేటర్‌లోనే ఎకైక టీడీపీ కార్పొరేటర్‌గా గుర్తింపు పొందారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసేందుకు ప్రయత్నించిన మందడి శ్రీనివాసరావు చివరకు ఎన్టీఆర్‌ కుటుంబీకురాలు సుహాసినికి మద్దతుగా పనిచేశారు. మందడి ప్రధాన అనుచరులలో కొందరు స్థానిక ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు సమక్షంలో టీఆర్‌ఎస్‌లో చేరినప్పటికీ అతను మాత్రం పార్టీ మారేందుకు అంగీకరించలేదు. అయితే తాజాగా పార్లమెంట్‌ ఎన్నికల నేపథ్యంలో మరోసారి ఎమ్మెల్యే కృష్ణారావు కార్పొరేటర్‌ మందడి శ్రీనివాసరావును టీఆర్‌ఎస్‌లోకి ఆహ్వానించారు. దీంతో అతను కూడా పార్టీ మారేందుకు అంగీకరించి ప్రగతిభవన్‌లో కేటీఆర్‌ను సైతం కలిశారు.

రెండు రోజుల్లో పూర్తిస్థాయిలో నాయకులు, కార్యకర్తలతో కలిసి టీఆర్‌ఎస్‌లో అధికారికంగా చేరనున్నట్లు ఆయన అనుచరులు ప్రకటించారు. అయితే రాత్రికిరాత్రి తాను పార్టీని, పదవిని వీడుతున్నానంటూ ప్రకటించడంతో టీడీపీ క్యాడర్, మందడి అనుచరులు ఆయోమయానికి గురవడం గమనార్హం. ఈ సందర్భంగా గురువారం రాత్రి ముఖ్యకార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. టీడీపీకి రాజీనామా చేసినా అభ్యంతరం లేదని, రాష్ట్రంలో ఉన్న అధికార పార్టీలో చేరి ప్రజలకు సేవ చేయాలని వారు ఆయనను కోరారు. తన నిర్ణయం తర్వాత వెల్లడిస్తానని కార్యకర్తలతో ఆయన తెలిపారు.

మరిన్ని వార్తలు