తల్లిదో మాట.. తనయుడిదో మాట

22 Apr, 2019 11:27 IST|Sakshi

లక్నో : ‘‘ నా ముస్లిం సోదరులకు నేను ఒక్కటే చెప్పదలుచుకున్నాను. మీరు నాకు ఓటేస్తే చాలా సంతోషిస్తా. ఒక వేళ ఓటు వేయకపోయినా నేను పట్టించుకోను. మీ కోసం పనిచేస్తా’’  ఆదివారం ఎన్నికల ప్రచార సభలో పిలీభిత్‌ నియోజకవర్గ బీజేపీ అభ్యర్థి వరుణ్‌ గాంధీ అన్న మాటలివి. వరుణ్‌ గాంధీ ప్రచారంలో దూసుకుపోతున్నారు. ముఖ్యంగా ముస్లిం ఓటర్లను ఆకర్షించటానికి ప్రయత్నిస్తున్నారు. తల్లి కంచుకోటలో ఎలాగైనా తన స్థానాన్ని సుస్థిరం చేసుకోవాలని చూస్తున్నారాయన. ఇదిలా ఉండగా వరుణ్‌ గాంధీ తల్లి కేంద్రమంత్రి మేనకా గాంధీ ఇందుకు పూర్తి వ్యతిరేకంగా చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్‌గా మారాయి. సుల్తాన్‌ పూర్‌ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న ఆమె కొద్ది రోజుల క్రితం ముస్లిం ఓటర్లను ఉద్దేశిస్తూ మాట్లాడారు‘‘ నేను గెలవబోతున్నాను. మీరు ఓటు వేసినా.. వేయకపోయినా.. మీరు 100 ఓట్లు వేయండి. 50 ఓట్లు వేయండి. మీరు నాతో పనిచేయించుకోవడానికి వచ్చినపుడు దాన్నే నేను దృష్టిలో పెట్టుకుంటాను.’’  అంటూ తనకు ఓటు వేయకపోతే ముస్లింలకు ఎలాంటి సహాయం చేసేది లేదని ఆమె చెప్పకనే చెప్పారు. ఒకరకంగా బెదిరింపులకు దిగారు.

అయితే ఈ వ్యాఖ్యాలను ఈసీ సీరియస్‌గా తీసుకుంది. ఆమెపై రెండురోజుల పాటు ప్రచార నిషేదం విధించింది. ఉత్తరప్రదేశ్‌లోని పిలీభీత్‌ స్థానం నుంచి వరుణ్‌ గాంధీ తల్లి మేనకా గాంధీ 1989 నుంచి ఆరుసార్లు విజయం సాధించి, ఈ స్థానాన్ని కంచుకోటగా మలుచుకున్నారు. 2014 లోక్‌సభ ఎన్నికల్లో 52 శాతం ఓట్లను సాధించి మేనకా గాంధీ విజయఢంకా మోగించారు. అంతకు ముందు 2009 ఎన్నికల్లో ఇదే స్థానం నుంచి వరుణ్‌ గాంధీ పోటీచేసి, మూడు లక్షల పైచిలుకు ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ఈ ఎన్నికల్లో తల్లీ కొడుకులు తమ నియోజకవర్గాలను పరస్పరం మార్చుకోవడం విశేషం. ఈసారి మేనకా గాంధీ స్థానంలో ఆమె కుమారుడు వరుణ్‌ గాంధీ ఈ నియోజకవర్గం నుంచి బీజేపీ తరఫున బరిలోకి దిగారు. సుల్తాన్‌పూర్‌ నుంచి మేనకా గాంధీ పోటీ చేస్తున్నారు.

మరిన్ని వార్తలు