పాతికేళ్ల పాలన.. ఏమైనా జరిగిందా : మాణిక్‌ సర్కార్‌

30 Jul, 2018 19:08 IST|Sakshi
మాణిక్‌ సర్కార్‌ (ఫైల్‌ ఫోటో)

సాక్షి, న్యూఢిల్లీ :  త్రిపురలో పాతికేళ్ల వామపక్ష ప్రభుత్వంలో ఎప్పుడూ మూక దాడులు జరిగిన ఘటనలు చోటుచేసుకోలేదని త్రిపుర మాజీ సీఎం మాణిక్‌ సర్కార్‌ పేర్కొన్నారు. కనీసం ఏడాది కూడా ముగియకముందే రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం దాడులకు పాల్పడి, ప్రజలను భయాందోళనకు గురిచేస్తోందని మండిపడ్డారు. ప్రజలకు ఇచ్చిన హామీలను అమలుచేయడంలో బీజేపీ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని, తన వైఫల్యాల నుంచి తప్పించుకునేందుకే  ఈ దాడులకు పాల్పడుతోందని మాణిక్‌ ఆరోపించారు.

ఢిల్లీలో వామపక్షల ఆధ్వర్యంలో సోమవారం నిర్వహించిన ‘ప్రజాస్వామ్య హత్య’  నిరసన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ‘దేశ వ్యాప్తంగా బీజేపీ గోరక్షణ పేరుతో అమాయక ప్రజలపై దాడులకు పాల్పడుతోంది. పాతికేళ్ల వామపక్ష ప్రభుత్వంలో త్రిపురలో ఏలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోలేదు. హిందుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడిన ప్రతి ఒక్కరిని ప్రభుత్వం టార్గెట్‌ చేస్తోంది. మైనార్టీ, దళితులకు దేశంలో రక్షణ లేదు. ప్రతీక్షణం భయం, భయంగా బతుకుతున్నారు. మూక దాడులు అనేవి ప్రభుత్వం చేస్తున్న గొప్ప కుట్ర. త్రిపురలో సీఎం ఉన్నా.. అక్కడ సాగేది మోదీ పాలనే’ అని అన్నారు.
 

మరిన్ని వార్తలు