‘పాన్‌షాప్‌లను జూద అడ్డాలుగా మారుస్తారా..?’

6 Jul, 2018 19:37 IST|Sakshi
కాంగ్రెస్‌ నేత మనీశ్‌ తివారి

సాక్షి, న్యూఢిల్లీ : క్రికెట్‌ వంటి జనాదరణ కలిగిన క్రీడల్లో బెట్టింగ్‌, గ్యాంబ్లింగ్‌లను చట్టబద్ధం చేయాలంటూ లా కమిషన్‌ చేసిన సిఫార్సులపై కాంగ్రెస్‌ పార్టీ మండిపడింది. ఆదాయం సమకూర్చుకునేందుకు బెట్టింగ్‌ సంస్కృతిని ప్రోత్సహించడాన్ని హేయమైన చర్యగా అభివర్ణించింది. కాంగ్రెస్‌ సీనియర్‌ నేత మనీశ్‌ తివారి ఏఎన్‌ఐతో మాట్లాడుతూ... వివాదాస్పదమైన ఈ నిర్ణయం క్రీడలతో పాటు సమాజంపై కూడా చెడు ప్రభావం చూపుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. బెట్టింగ్‌ను చట్టబద్దం ద్వారా చేయడం ద్వారా దేశంలోని ప్రతీ పాన్‌షాప్‌ను జూదానికి అడ్డాగా మార్చాలనుకుంటున్నారా అంటూ ఎన్డీయే ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఇటువంటి అనుచిత నిర్ణయాల వల్ల సమాజంపై ఎటువంటి ప్రభావం పడుతుందో ఒకసారి ఆలోచించాలంటూ హితవు పలికారు.

కాగా లా కమిషన్(21వ) తాజాగా చేసిన సిఫార్సుల్లో గ్యాంబ్లింగ్, క్రీడల్లో బెట్టింగ్ ను అనుమతించాలని పేర్కొన్న విషయం తెలిసిందే. తద్వారా కేంద్ర ఖజానాకు పన్ను రూపంలో మరింత ఆదాయం వస్తుందని కమిషన్‌ వెల్లడించింది. వీటితోపాటు క్యాసినో, ఆన్‌లైన్‌ గేమింగ్ పరిశ్రమలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను(ఎఫ్‌డీఐ) అనుమతించాలని కూడా లా కమిషన్ సిఫార్సు చేసింది. అయితే ఇందుకోసం ఓ నియంత్రణా వ్యవస్థ ఏర్పాటు చేయాలని, తద్వారా ఆదాయాన్ని పెంచుకోవచ్చని కమిషన్‌ పేర్కొంది.

మరిన్ని వార్తలు