మరోసారి రాజ్యసభకు మాజీ ప్రధాని

2 Aug, 2019 17:33 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: మాజీ ప్రధాని, కాంగ్రెస్ సీనియర్ నేత మన్మోహన్ సింగ్ మరోసారి రాజ్యసభకు ఎన్నికయ్యే అవకాశం కనిపిస్తోంది. విశ్వసనీయ సమాచారం ప్రకారం ఈసారి రాజస్తాన్‌ నుంచి ఆయన్ను రాజ్యసభకు పంపేలని పార్టీ అధిష్టానం నిర్ణయించినట్లు తెలిసింది. రాజ్యసభకు జరుగనున్న ఉపఎన్నికలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీలో దిగనున్నట్లు సమాచారం.  ఆయన అభ్యర్థిత్వంపై కాంగ్రెస్ అధిష్ఠానం నిశ్చితాభిప్రాయానికి వచ్చినట్టు పార్టీ సీనియర్ నేత ఒకరు తెలిపారు.

ఈనెల 26న రెండు రాజ్యసభ స్థానాలకు జరుగనున్న ఉపఎన్నికలను ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్‌ ప్రకటించింది. ఇందులో ఒకటి రాజస్తాన్‌ నుంచి కాగా, మరొకటి ఉత్తరప్రదేశ్ నుంచి. బీజేపీ ఎంపీ మదన్ లాల్ సైనీ గత జూన్‌లో కన్నుమూయడంతో రాజస్తాన్‌ సీటు ఖాళీ అయిన విషయం తెలిసిందే. కాగా, సమాజ్‌వాదీ పార్టీ ఎంపీ నీరజ్ శేఖర్ గత జూలైలో పార్టీ మారి బీజేపీలో చేరడం, రాజ్యసభ సీటుకు రాజీనామా చేయడంతో యూపీలో రాజ్యసభ స్థానానికి ఉపఎన్నిక అనివార్యమైంది.  ఈరెండు స్థానాలకు ఉప ఎన్నికలు జరపాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ఆ స్థానంలో మన్మోహన్‌ సింగ్‌ను బరిలో నిలపాలని పార్టీ నిర్ణయించింది. 
 
మన్మోహన్ సింగ్ రాజ్యసభ సభ్యుడిగా 1991 నుంచి సుధీర్ఘంగా కొనసాగుతూ వచ్చారు. 1991 నుంచి 1996 వరకు పీవీ నరసింహారావు ప్రధానిగా ఉన్న సమయంలో ఆయన ఆర్థిక మంత్రిగా సేవలు అందించారు. 1991లో కేంద్రం తీసుకువచ్చిన ఆర్థిక సంస్కరణల్లో మన్మోహన్‌ కీలక భూమిక పోషించిన సంగతి తెలిసిందే. ఆయన పదేళ్లపాటు ప్రధానిగా ఉన్న సయమంలో కూడా రాజ్యసభ నుంచి పార్లమెంట్‌కు ప్రాతినిథ్యం వహించారు.

మరిన్ని వార్తలు