ఓట్లడిగే పద్ధతి ఇది కాదు

3 Dec, 2017 02:31 IST|Sakshi

మోదీకి మన్మోహన్‌ చురకలు

సూరత్‌: ప్రధాని మోదీపై మాజీ ప్రధాని మన్మోహన్‌ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. నోట్ల రద్దు, జీఎస్టీ అమలుతో సామాన్యులు పడుతున్న ఇబ్బందులను అర్థం చేసుకోవటంలో విఫలమైన మోదీ ప్రజల్లోకి ఎలా వెళతారన్నారు. ఓట్లడిగేటప్పుడు గౌరవప్రదమైన విధానాన్ని ఎంచుకోవాలన్నారు. నోట్ల రద్దును అకస్మాత్తుగా, సన్నద్ధం కాకుండానే చేసిన యుద్ధంగా అభివర్ణించారు. ఈ కారణంగానే సొంత రాష్ట్రంలోని వస్త్ర పరిశ్రమకు నిలయమైన సూరత్‌లో నేతన్నలు 89 వేల మరమగ్గాలను తెగనమ్ముకున్నారని, 31వేల మంది ఉపాధి కోల్పోయారని వివరించారు.

నల్లధనం వెలికితీసేందుకు చేపట్టిన నోట్లరద్దుతో ప్రభుత్వం సామాన్యుడిని కూడా దొంగలా చూస్తోందన్నారు. జీఎస్టీ భయంతో పెట్టుబడులు పెట్టేందుకు వ్యాపారవర్గాలు జంకుతున్నాయన్నారు. తనను కలిసిన కొందరు వ్యాపారవేత్తలనుద్దేశించి ఆయన మాట్లాడారు. నోట్ల రద్దు షాక్‌ నుంచి ప్రజలు తేరుకోకమునుపే ప్రధానమంత్రి జీఎస్టీని తీసుకువచ్చారని అన్నారు. దీనికోసం ఎవరినైనా సంప్రదించటం కానీ, సమస్యను అర్థం చేసుకోవటంగానీ లేకుండా మోదీ ఏకపక్షంగా వ్యవహరించారన్నారు. 

మరిన్ని వార్తలు