జైపాల్‌రెడ్డి మచ్చలేని నాయకుడు : మన్మోహన్‌

3 Sep, 2019 20:09 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : కేంద్ర మాజీ మంత్రి జైపాల్‌రెడ్డి అవినీతి మచ్చలేని గొప్ప నాయకుడని మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ అన్నారు. తెలంగాణకు అనుకూలంగా కాంగ్రెస్‌ అధిష్టానాన్ని ఒప్పించడంలో జైపాల్‌రెడ్డి కీలకపాత్ర పోషించారని తెలిపారు. జూలై 28నఅనారోగ్యంతో కన్నుమూసిన జైపాల్‌రెడ్డి సంస్మరణ సభ మంగళవారం సాయంత్రం ఢిల్లీలో జరిగింది. ఈ  సభకు మన్మోహన్‌సింగ్‌తోపాటు ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు, బీజేపీ సీనియర్‌ నేత మురళీ మనోహర్‌ జోషి, ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ హాజరయ్యారు. ఈ సందర్భంగా జైపాల్‌రెడ్డితో వారికున్న అనుబంధాన్ని నేతలు గుర్తుచేసుకున్నారు. మన్మోహన్‌సింగ్‌ మాట్లాడుతూ.. భారత రాజకీయాలు గొప్ప నాయకుడిని కోల్పోయిందన్నారు. జాతీయ రాజకీయాల్లో ఆయన క్రీయాశీలక పాత్ర పోషించారని గుర్తుచేశారు. నమ్మిన సిద్ధాంతాలపై ఎన్నడూ రాజీపడలేదని కొనియాడారు. ఏపీ విభజనలో ఆయన కీలక​ భూమిక పోషించారని చెప్పారు. పేద, బలహీన వర్గాల అభ్యున్నతి కోసం పనిచేశారన్నారు.

వెంకయ్యనాయుడు మాట్లాడుతూ.. జైపాల్‌రెడ్డి గొప్ప పార్లమెంటరీయన్‌ అని అన్నారు. ఆయన ప్రసంగాలు ఇప్పటికీ ఎంతో విలువైనవని తెలిపారు. ఏపీ అసెంబ్లీలో తమను తిరుపతి వెంకట కవులు అని పిలిచేవారని గుర్తుచేశారు. మురళీ మనోహర్‌ జోషి మాట్లాడుతూ.. నమ్మిన సిద్ధాంతాల కోసం రాజీపడని వ్యక్తి జైపాల్‌రెడ్డి అని కొనియాడారు. అనుకున్న విషయాన్ని నిర్భయంగా చెప్పడంలో ఆయన వెనక్కి తగ్గేవారు కాదన్నారు. భిన్న శక్తుల మధ్య ఎప్పుడూ చర్చ జరగాలని చెప్పారు. కొన్ని అంశాలపై పార్టీలు రాజకీయాలు పక్కనపెట్టి దేశహితం కోసం పనిచేయాలని పిలుపునిచ్చారు. 

కేజ్రీవాల్‌ మాట్లాడుతూ.. సెక్యూలర్‌ పదానికి జైపాల్‌రెడ్డి ప్రతీకగా నిలిచారని కొనియాడారు. ఆయనకు శత్రువులు ఎవరు లేరని అన్నారు. అవినీతిమయమైన ప్రపంచంలో ఆయన ఒక ఆశా కిరణమని పేర్కొన్నారు. అవినీతిని ఎదురించే క్రమంలో ఆయన చాలా కోల్పోయారని వ్యాఖ్యానించారు. శరద్‌యాదవ్‌ మాట్లాడుతూ.. జైపాల్‌రెడ్డి ఎక్కడ ఉన్నా నమ్మిన సిద్ధాంతాన్ని వీడలేదని గుర్తుచేశారు. పార్లమెంట్‌లో ఆయన అద్భుత ప్రసంగాలు చేశారని తెలిపారు. సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డీ రాజా మాట్లాడుతూ.. జైపాల్‌రెడ్డిని వామపక్షాల స్నేహితుడిగా అభివర్ణించారు. ప్రస్తుతం ఉన్న నాయకులు ఆయన స్పూర్తిని కొనసాగించాలన్నారు. ఆయన గొప్ప ప్రజాస్వామ్యమవాదని చెప్పారు. సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి మాట్లాడుతూ.. జైపాల్‌రెడ్డి గొప్ప మానవతావాది అని అభివర్ణించారు. 

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు