సంక్షేమ పాలనను చూడలేకే కుట్రలు

9 Jun, 2020 04:38 IST|Sakshi

టీడీపీపై వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే మానుగుంట మహీధర్‌రెడ్డి ధ్వజం

భవిష్యత్‌ ఏంటో అర్ధంకాక టీడీపీ నేతల్లోనే అసంతృప్తి 

దీన్ని కప్పిపుచ్చుకునేందుకు మాపై అసత్య ప్రచారాలు 

సీఎం వైఎస్‌ జగన్‌ చెప్పింది చెప్పినట్లుగా అభివృద్ధి చేస్తున్నారు 

కందుకూరు: ఏడాది పాలనలోనే చెప్పింది చెప్పినట్లుగా సంక్షేమ కార్యక్రమాలు అమలుచేస్తూ రాష్ట్రాన్ని అన్ని విధాల అభివృద్ధి చేసేందుకు కృషిచేస్తున్న సీఎం వైఎస్‌ జగన్‌ పాలనను చూసి ఓర్వలేకే ప్రభుత్వంలో అసంతృప్తులు అంటూ టీడీపీ కుట్రలకు పాల్పడుతోందని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే మానుగుంట మహీధర్‌రెడ్డి మండిపడ్డారు. నిజానికి.. వయస్సు అయిపోయిన చంద్రబాబువల్ల తమ భవిష్యత్‌ ఏంటో అర్ధంకాక ఆ పార్టీ నేతల్లోనే అసంతృప్తి ఉందన్నారు. తనకెలాంటి అసంతృప్తి లేదని ఆయన స్పష్టంచేశారు. ఇప్పటికే ముగ్గురు టీడీపీ ఎమ్మెల్యేలు పార్టీని వీడారని ఇంకెంత మంది వెళ్లిపోతారో అర్ధంకాని పరిస్థితి టీడీపీలో ఉందన్నారు. దీన్ని కప్పిపుచ్చుకునేందుకే ప్రభుత్వంలో అసంతృప్తులు అంటూ తమపై అసత్య వార్తలు రాస్తున్నారని సోమవారం ఆయన మీడియా సమావేశంలో ఆరోపించారు.

తన నియోజకవర్గంలో మంచినీటి పథకాలకు సంబంధించి విడుదల కావాల్సిన బిల్లులు విడుదల చేయకుండా కాలయాపన చేస్తున్న జడ్పీ సీఈఓను ప్రశ్నించానన్నారు. దీన్ని కొందరు ప్రభుత్వ వ్యతిరేక చర్యగా చూపించే ప్రయత్నం చేశారని మహీధర్‌రెడ్డి అన్నారు. అధికారుల నిర్లక్ష్యాన్ని ప్రశ్నించడం ఎలా తప్పవుతుందని, వారితో సక్రమంగా పనిచేయించాల్సిన బాధ్యత తమపై ఉంటుందని వివరించారు. అలాగే, రామాయపట్నం పోర్టు నిర్మాణానికి అవసరమైన భూసేకరణకు జీఓ విడుదల చేయడమే కాకుండా, మాచవరం వద్ద మన్నేరుపై బ్రిడ్జి నిర్మాణానికి రూ.12 కోట్లు, వీఆర్‌కోట సప్‌లై చానల్‌ అభివృద్ధికి రూ.18 కోట్లు, కరేడు ఆనకట్ట అభివృద్ధికి రూ.8 కోట్లు ఇలా నియోజకవర్గ అభివృద్ధికి కోట్ల రూపాయలు మంజూరు చేసిన సీఎంపై తనకెందుకు అసంతృప్తి ఉంటుందని ఆయన ప్రశ్నించారు.

మరిన్ని వార్తలు