వైఎస్‌ జగన్‌కు రాజయోగమే

6 Apr, 2019 09:53 IST|Sakshi

సాక్షి, అమరావతి :  రాష్ట్రంలో అధికారంలోకి రానున్నది వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీయేనని పలువురు జ్యోతిష్య నిపుణులు నొక్కి వక్కాణిస్తున్నారు. ఆయా పార్టీల అధ్యక్షుల జాతక రీత్యా, గ్రహ స్థితిగతులను బట్టి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి కావడం ఖాయమంటున్నారు.  వైఎస్‌ జగన్‌ సీఎం అవ్వడం ద్వారా రాష్ట్రానికి ప్రత్యేక హోదా కూడా సిద్ధిస్తుందని చెబుతున్నారు. చంద్రబాబునాయుడికి 8వ ఇంట శని వల్ల రాజయోగం ప్రాప్తించదంటున్నారు. ఉగాది పర్వదినం (వికారి నామ సంవత్సర) సందర్భంగా పలువురు పండితులు వెలిబుచ్చిన అభిప్రాయాలివి..         

వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ లగ్నాధిపతి అయిన చంద్రుడు ఉచ్ఛ స్థితిలో ఉన్నాడు. దీనివల్ల ఎన్ని సమస్యలు వచ్చినా ఆ సమస్యలను, కష్టాలను తట్టుకుని తప్పనిసరిగా అధికారంలోకి వస్తుంది. ఈ పార్టీకి 2013 జూలై 16 నుంచి 2020 జూలై 16 వరకు కుజ మహర్దశ నడుస్తుంది. ముఖ్యంగా 2019 ఆగస్టు 10 నుంచి 2019 డిసెంబర్‌ 16 వరకు కుజ మహర్దశలో శుక్రుని అంతర్దశ ఉండటం వల్ల ఈ కాలం అత్యంత యోగదాయకం.

కనుక ఈ అసెంబ్లీ ఎన్నికలలో ఈ పార్టీ తప్పనిసరిగా విజయం సాధిస్తుంది. వైఎస్‌ జగన్‌ జాతకం ప్రకారం 2000 మే 14 నుంచి 2019 మే 14 వరకు శని మహర్దశ నడుస్తున్నది. శని కన్యా లగ్నమునకు పంచమ షష్ఠాధిపతిగా భాగ్య స్థానంలో ఉన్నాడు. ముఖ్యంగా 2016 నవంబర్‌ 2 నుంచి 2019 మే 14 వరకు శని మహర్దశలో గురువు అంతర్దశ నడవటం వల్ల గురు గ్రహానికి అష్టక వర్గంలో ఆరు బిందువులు రావడం వల్ల అత్యంత యోగదాయకంగా ఉంటుంది. కనుక రాబోయే అసెంబ్లీ ఎన్నికలలో ఈ జాతకునికి అధిక సీట్లు (110–120 సీట్లు) తప్పనిసరిగా వస్తాయి. వైఎస్‌ జగన్‌ తప్పనిసరిగా ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి అవుతారు.  

అష్టమ శని వల్ల టీడీపీకి ఘోర పరాజయం తప్పదు 
తెలుగుదేశం పార్టీకి 2010 మే 28 నుంచి 2026 మే 28 వరకు గురు మహర్దశ నడుస్తుంది. 2018 ఏప్రిల్‌ 10 నుంచి 2020 డిసెంబర్‌ 9 వరకు గురు మహర్దశలో రవి అంతర్దశ నడుస్తుంది. గురువు కర్కాటక లగ్నమునకు భాగ్యస్థానంలో ఉండుట వల్ల ఆ గురువును శని, కుజులు వీక్షించడం వల్ల, మహర్దశపై ఆధారపడిన గురువుకు అంతర్దశ అధిపతి అయిన రవికి షష్టాకములు  ఏర్పడ్డాయి. దీంతో గోచార రీత్యా అష్టమ శని వల్ల రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ఈ పార్టీకి ఘోర పరాజయం కలుగుతుంది.

ఇన్నాళ్లూ లగ్నాధిపతి భాగ్యస్థానంలో ఉండటం వల్ల ఎన్ని కష్టాలు వచ్చినా చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యేందుకు ఆస్కారం కలిగింది. అయితే ఇప్పుడు గ్రహాలు అనుకూలంగా లేవు. 2018 అక్టోబర్‌ 28 నుంచి 2019 నవంబర్‌ 16 వరకు కుజ మహర్దశలో రాహువు అంతర్దశలో నడుస్తాడు. మహర్దశాధిపతి అయిన కుజుడు సప్తమ వ్యయాధిపతిగా చతుర్ధ స్థానంలో ఉండి సామాన్య ఫలితాలు ఇస్తాడు. కానీ అంతర్దశాధిపతి అయిన రాహువు వ్యయస్థానంలో ఉండటం వల్ల, గోచారేతన గురువు జన్మరాశిలోను శని ద్వితీయ స్థానంలో, రాహువు అష్టమ స్థానంలో ఉండటం వల్ల ఇప్పుడు చాలా కష్టకాలం.

కనుక రాబోవు అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపి అధికారంలోకి వచ్చే అవకాశం లేదు. జనసేన పార్టీ అధిపతి పవన్‌ కళ్యాణ్‌కు 2006 జూన్‌ 9 నుంచి 2022 జూన్‌ 9 వరకు గురు మహర్దశ నడుస్తుంది. 2019 ఫిబ్రవరి 9 నుంచి 2020 జనవరి 15 వరకు గురు మహర్దశలో కుజుని అంతర్దశ ఉంటుంది. కుజుడు వ్యవస్థానంలో ఉండటం వల్ల, నవాంశ చక్రంలో మిథునలగ్నం అయి, కుజుడి వల్ల ఈ అంతర్దశలో ఏ మాత్రం యోగం చేయదు.       

వైఎస్‌ జగన్‌కు ఎదురే లేదు.. 
వికారి నామ సంవత్సరంలో వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి ఎదురులేదు. రవి, కుజుడు, చంద్రుడు, శుక్రుడు, శని.. వైఎస్‌ జగన్‌కు అనుకూలంగా ఉన్నారు. అందువల్ల అన్ని ఒడిదుడుకులను అధిగమించి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం తథ్యం.  రాహు, కేతువుల అన్యోన్యత అధికంగా ఉండటం వల్ల రాజ్యాధికారం ఖాయం. జగన్‌ హయాంలో ఏపీలో వ్యవసాయం బాగా అభివృద్ధి చెందుతుంది. నిరుద్యోగులకు ఉద్యోగవకాశాలు విస్తారంగా లభిస్తాయి. నూతన పరిశ్రమలు ఏర్పాటవుతాయి. విదేశీ పెట్టుబడులు వెల్లువలా తరలివస్తాయి. సాగునీటి ప్రాజెక్టులు వేగవంతంగా పూర్తవుతాయి. మహిళల అభ్యున్నతి సాధ్యపడుతుంది.  
 – మాండ్రు నారాయణ రమణారావు, సిద్ధాంతి, భీమవరం     

మరిన్ని వార్తలు