ఎన్నో పార్టీలు ఎప్పటికీ అంగీకరించవు!

19 Jun, 2019 20:18 IST|Sakshi

న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా రాష్ట్రాల అసెంబ్లీలకు, లోక్‌సభకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలన్న కీలక అంశంపై కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో బుధవారం అఖిలపక్ష సమావేశం జరిగిన సంగతి తెలిసిందే. జమిలి ఎన్నికల నిర్వహణపై ఓ కమిటీ వేయాలని ఈ సమావేశంలో నిర్ణయించారు. అయితే, జమిలి ఎన్నికల నిర్వహణపై రాజకీయ పార్టీల్లో భిన్నస్వరాలు వినిపిస్తున్నాయి. ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌, పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతాబెనర్జీతోపాటు పలు పార్టీల అధ్యక్షులు ఈ సమావేశానికి హాజరు కాలేదు.

ఈ నేపథ్యంలో ఎస్పీ అధినేత అఖిలేశ్‌ యాదవ్‌ జమిలి ఎన్నికలపై కీలక వ్యాఖ్యలు చేశారు. దేశంలో ఎన్నో పార్టీలు జమిలి ఎన్నికలను ఎప్పటికీ అంగీకరించబోవని ఆయన తేల్చిచెప్పారు. జమిలి ఎన్నికల పేరిట దేశ ప్రజల దృష్టిని మళ్లించడం కంటే ప్రజలకు తాము ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు ప్రధాని మోదీ ప్రభుత్వం ఎక్కువ కష్టపడటంపై దృష్టి పెట్టాలని ఆయన హితవు పలికారు. జమిలి ఎన్నికలపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ అధ్యక్షతన ఢిల్లీలో జరిగిన అఖిలపక్ష సమావేశంలో ఎస్పీ, బీఎస్పీ అధినేతలైన అఖిలేశ్‌, మాయావతి పాల్గొనలేదు.
 

మరిన్ని వార్తలు