ఎన్నికలయ్యాక మేనిఫెస్టోలకు పవిత్రత, చట్టబద్ధత కావాలి

27 Nov, 2018 03:45 IST|Sakshi

ఎన్నికల ప్రణాళిక(మేనిఫెస్టో)లు, వాటి అమలు రాను రాను ప్రహసనంగా మారుతున్నాయి. అలా కాకుండా వాటికి ఒక పవిత్రత, చట్టబద్ధత, అమలుపరచకుంటే... సదరు ప్రభుత్వాలను రద్దయినా చేసే పరిస్థితి రావాలనే డిమాండ్‌ క్రమంగా పెరుగుతోంది. అలాంటి నిబద్ధతే లేకుంటే, అదీ ఒక రకంగా ఓటర్లను గంపగుత్తగా ప్రలోభపెట్టడమే అవుతుంది. ఎన్నికల ముందు ఏ వాగ్దానమైనా చేయొచ్చు. అరచేత వైకుంఠం చూపి, ఆకర్శణీయ వరాలతో ప్రజల్ని నమ్మించి ఓట్లు దండుకున్నాక.... సదరు హామీలను పూర్తిగా మర్చిపోయి, ఇష్టానుసారం వ్యవహరిస్తే ఇక ఎన్నికల ప్రణాళికకు ఉండే విలువేంటి? దాన్ని నమ్మి ఓట్లేసిన ప్రజల పరిస్థితి ఏంటి? అని ఆలోచనాపరులు, మేధావులు ప్రశ్నిస్తున్నారు. ‘మేనిఫెస్టో’ అంటే, ‘ఇదుగో మేం అధికారంలోకి వస్తే ఈ విషయంలో ఇలా చేస్తాం’అని ముందుగానే ఆయా రాజకీయ పార్టీలు చేసే నిర్దిష్ట ప్రతిపాదన వంటిది. దాన్ని చూసి, నమ్మకంతో ఓటువేసి సదరు పార్టీని ప్రజలు అధికారంలోకి తీసుకురావడమంటేనే, వారిద్దరి మధ్య అదొక పరస్పర అంగీకార పత్రం అయినట్టే లెక్క! అందుకని, పాలకపక్షంగా ఆయా పార్టీలు మేనిఫెస్టోలను అమలు పరచాలి.

మేనిఫెస్టో అమలుపరచకపోవడం అంటే, సదరు పరస్పర అంగీకారాన్ని ఉల్లంఘించడమే! ప్రజాస్వామ్య ప్రక్రియలో భాగమైన ఒక అంగీకారాన్ని ఉద్దేశపూర్వకంగా ఉల్లంఘించడాన్ని చట్టవిరుద్ధ చర్యగా పరిగణించాలి. తగు విధంగా శిక్షించాలి. ఇప్పటివరకు ఇది లేదు. మలి విడత ఎన్నికల సంస్కరణల్లో భాగంగా ఇటీవలి ఒక మార్పు ఏంటంటే, ప్రధాన పార్టీల ఎన్నికల ప్రణాళికలను ఎన్నికల సంఘం పరిశీలించి, ఆమోదించిన తర్వాతే వాటిని ఆయా పార్టీలు అధికారికంగా ప్రకటించాలి. ‘ఇది మా మేనిఫెస్టో’ అని ఆయా పార్టీల వారితో డిక్లరేషన్‌ తీసుకుంటున్నారు. ఇది కొంతలో కొంత మేలు! అలా ప్రకటించిన ప్రణాళికను సదరు పార్టీలు అధికారంలోకి వచ్చాక అమలుపరచకపోతే, ప్రజలెవరైనా న్యాయస్థానాలను సంప్రదించవచ్చనే వెసలుబాటు కల్పించారు. కానీ, ఇది మాత్రమే సరిపోదు! ప్రకటించిన స్ఫూర్తి కొరవడకుండా మేనిఫెస్టోను ‘యధాతథం’ అమలు చేయాల్సిన అవసరం ఉంటుంది. అలా కాకుండా, ‘ఇదో ఇలా అన్నాం, ఇలా చేశాం, ఇది అమలుపరచడమే!’ అని అరకొరగా చేసి, అటు ఇటుగా తిప్పి బుకాయిస్తే సరిపోదు. దాన్ని నిలదీయడానికి, సదరు వైఫల్యానికి ఆయా పార్టీలను–ప్రభుత్వాలను జవాబుదారు చేయడానికి ఈ విషయంలో ఒక చట్టబద్ద రక్షణ అవసరం.

నిన్నటికి నిన్న మనమే చూశాం, రెండు తెలుగు రాష్ట్రాల్లో 2014 ఎన్నికల్లో పెద్ద పెద్ద హామీలతో ఎన్నికల ప్రణాళికల్ని ప్రకటించిన పాలకపక్షాలు, అధికారం చేజిక్కాక హామీలను సవ్యంగా నెరవేర్చకపోగా అమలుపరచినట్టు జబ్బలు చరచుకున్నాయి. హామీ–అమలుకు మధ్య వ్యత్యాసానికి వక్రభాష్యం చెప్పాయి. కొన్నిటికి సమాధానమే లేదు. పాలన మొదలై రెండున్నరేళ్లు గడవక ముందే, ‘మా ఎన్నికల మేనిఫెస్టోలను పూర్తిగా అమలు చేయడమే కాకుండా, ఎన్నికల్లో ఇవ్వని హామీలను కూడా నెరవేర్చినందుకు ఎంతో సంతృప్తిగా ఉంద’ని రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు బహిరంగంగా ప్రకటించి ప్రజల్ని విస్మయ పరిచారు. ఈ పరిస్థితి మారాలి. నిబద్ధత కావాలి. కొన్ని కీలక విషయాల్లో ‘పర్యావరణానికి మేం కట్టుబడి ఉన్నాం’ ‘పేదరికాన్ని నిర్మూలించడానికి మా పార్టీ కట్టుబడి ఉంది’. ‘మేనిఫెస్టోలు–అమలు’పై తెలంగాణ వర్కింగ్‌ జర్నలిస్ట్‌ ఫెడరే షన్‌ హైదరాబాద్‌లో సోమవారం ఒక రౌండ్‌ టేబుల్‌ సమావేశం నిర్వహించింది. పలువురు ప్రొఫెసర్లు, ఎడిటర్లు ఇవే అభిప్రాయాల్ని వ్యక్తం చేశారు. 

పేదవాడిని బాగుపర్చేలా... 
ఎన్నికల ప్రణాళికలు, సబ్సిడీలు పేదవాడ్ని బాగుచేయాలి తప్ప ధనికుల్ని మరింత ధనికుల్ని చేసేలా ఉండకూడదు. తమ ప్రణాళికాంశాల ఆర్థిక వ్యయాల్నీ ప్రకటించాలి. అవి రాష్ట్ర ఆదాయవనరులకు లోబడి ఉండాలి.                      
– ప్రొ. కంచ అయిలయ్య 

ప్రజలు నిలదీసే వాతావరణం ఏదీ? 
ఎన్నికల ప్రణాళికల్లో ప్రకటించిన సామాజికార్థికాంశాల్ని అమలుపరిచే సంస్కృతి మన రాజకీయ పార్టీలకు లేదు. అలా అమలు చేయనపుడు ప్రజలు పాలకుల్ని నిలదీసి ప్రశ్నించే ప్రజాస్వామ్య వాతావరణం రాష్ట్రంలో, దేశంలో లేదు.              
 – ప్రొ. హరగోపాల్‌

శ్వేతపత్రం కావాలి 
రాజకీయపార్టీలు అధికారంలోకి రాగానే తాము ప్రకటించిన ప్రణాళికను అమలుపరచాలి. అప్పటివరకు ఏ మేరకు అమలుపరచింది ప్రతి ఏటా ఒక శ్వేతపత్రం ద్వారా వెల్లడించాలి.            
–  ప్రొ.మురళీ మనోహర్‌ 

చర్యలుండాలి 
ఎన్నికల ప్రణాళిక అమలుపరచకపోతే నిలదీసే, చర్యతీసుకునే విధంగా దానికో చట్టబద్ధత ఉండాలి. చర్యలు తీసుకునే ఒక ఎజెన్సీ ఉండాలి.  
– వినయ్‌కుమార్, ఎడిటర్‌ 

నిబద్ధత లేకుంటే వృథాయే... 
పార్టీలు అనుత్పాదక రంగాలకు ప్రాధాన్యం ఇస్తున్నందున అభివృద్ధి కుంటుపడుతోంది. పార్టీలకు నిబద్ధత లేనపుడు మేనిఫెస్టోలు భ్రమ కల్పించే పత్రాలే! అవి తూకానికి తప్ప మరొకందుకు పనికిరావు.
– సారంపల్లి మల్లారెడ్డి, వ్యవసాయరంగ నిపుణులు
.:: దిలీప్‌రెడ్డి 

మరిన్ని వార్తలు