నేను బతికున్నాలేనట్టేనా..!

10 Mar, 2019 12:27 IST|Sakshi

సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం : పై ఫోటోలో కనిపిస్తున్న పెద్దాయన పేరు ప్రొఫెసర్‌ తిమ్మారెడ్డి. వయస్సు 80ఏళ్లు. ఆంధ్రవిశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్‌గా, రెక్టార్‌గా సేవలందించారు. ఇప్పుడు ప్రతిష్టాత్మక విశాఖ వ్యాలీ స్కూల్‌కు సెక్రటరీగా కరస్పాండెంట్‌గా వ్యవహరిస్తున్నారు. ఇటీవలి కాలంలో ఓట్ల గల్లంతుపై పత్రికల్లో వార్తలు వస్తుండటంతో  ‘ఏమో... తన ఓటు పరిస్థితి ఏమైందోనని...’ నెట్‌లో చూసుకున్నారు.. కానరాలేదు.. వెంటనే మహా విశాఖ నగరపాలకసంస్థ (జీవీఎంసీ)లోని సంబంధిత విభాగానికి తనకు పరిచయస్తురాలైన వర్సిటీ ఉద్యోగి సునీతారెడ్డిని పంపించారు. సంబంధిత విభాగం వారు తిమ్మారెడ్డి ఓటు లేదని తేల్చేశారు. ఆయన భార్య ఓటు కూడా లేదన్నారు. పైగా అక్కడున్న ఉద్యోగి ‘రెడ్డిగారు ఓటయితే ఎలా ఉంటుందండీ’ అని అన్యాపదేశంగా వ్యాఖ్యానించారు. తిమ్మారెడ్డి ఓటే కాదు.. సునీతారెడ్డి ఓటు, ఆమె కుటుంబ సభ్యుల ఓట్లు కూడా గల్లంతయ్యాయి.

ఇంతకంటే దుర్మార్గం లేదు..
తమ ఓట్లు తొలగింపుపై ప్రొఫెసర్‌ తిమ్మారెడ్డి తీవ్ర ఆందోళన, ఆవేదన వ్యక్తం చేశారు. ఓటు లేదంటే.. తాను బతికున్నా లేనట్టేనా అని వ్యాఖ్యానించారు. ఇప్పటికి 13 ఎన్నికల్లో ఓటు హక్కును వినియోగించుకున్నాను. ఈ ఎన్నికల్లోనే ఓటు లేదంటున్నారు. పైగా పేరు చివర రెడ్డి అని ఉంటే చాలు ఓటు ఉండదంటున్నారు. ఇంత దుర్మార్గం ఎప్పుడూ చూడలేదు. నా మనుమరాలికి అమెరికాలో ఓటుంది.. కానీ ఇక్కడ మాత్రం నాకు ఓటు లేదంట. కావాలంటే మళ్లీ దరఖాస్తు చేసుకోండి అంటున్నారు.

మూడు నెలల కిందట కూడా ఓటుంది.. ఈ మధ్యనే ఓటర్ల జాబితా నుంచి తీసివేశారు. మనం ఎటువంటి ప్రజాస్వామ్యంలో ఉన్నామో అర్థమవుతోంది.. అని తిమ్మారెడ్డి సాక్షి ప్రతినిధి వద్ద ఆవేదన వ్యక్తం చేశారు. ఓటరు కార్డు నుంచి ఆధార్‌కార్డు వరకు అన్ని కార్డులూ ఉన్నాయి.. అన్నీ ఉన్నా.. నేను బతికే ఉన్నా... నా ఓటును ఎందుకు తొలగించారో ఎన్నికల సంఘం అధికారులు, ప్రభుత్వ అధికారులు సమాధానమివ్వాలని ఆయన డిమాండ్‌ చేశారు.

ఏయూ మాజీ వీసీ ఓటూ గల్లంతే..
వీరివే కాదు.. ఓటు గల్లంతుపై ఆరా తీస్తే.. యూనివర్సిటీకి చెందిన చాలామంది ఓట్లు గల్లంతయ్యాయని తెలిసింది. అందులో ప్రధానంగా ఏయూ పూర్వ వైస్‌ చాన్సలర్‌ కేవీ రమణ ఓటు కూడా లేదు. ‘2019 ఎన్నికల్లో వైఎస్‌ జగన్‌ సీఎం కావడం చారిత్రక అవసరం.. కాకుంటే చారిత్రక తప్పిదమవుతుంది... ఎందుకంటే నాలుగున్నరేళ్లు గా రాష్ట్రంలో దుర్మార్గమైన పాలన నడుస్తోంది.. విలువలమీద, మాట మీద నిలబడే జగన్‌వంటి యువనాయకుడే  కొత్త రాష్ట్రానికి దిశా, నిర్దేశం ఇవ్వగలరు...’ అని కేవీ రమణ  గత ఏడాది సెప్టెంబర్‌ ఒకటిన విశాఖ నగరంలో జరిగిన మేధావుల సదస్సులో బాహాటంగానే తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. అందుకే ఆయన ఓటును కూడా తొలగించేశారని అంటున్నారు. అదే మాదిరి వైఎస్‌ జగన్‌కు అనుకూలంగా మాట్లాడే వెల్ఫేర్‌ ఇంజనీరింగ్‌ కళాశాల ప్రొఫెసర్‌ జేమ్స్‌ స్టీఫెన్‌ కుటుంబసభ్యుల ఓట్లు కూడా గల్లంతయ్యాయి.  

మరిన్ని వార్తలు