కోడ్‌ ఉల్లంఘనపై కోర్టుకు వెళ్తాం

1 Oct, 2018 03:33 IST|Sakshi

     ఎన్నికల కమిషన్‌ పారదర్శకంగా పనిచేయాలి

     టీపీసీసీ ఎన్నికల సంఘం సమన్వయ కమిటీ చైర్మన్‌ మర్రి శశిధర్‌రెడ్డి  

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులో ఎలాంటి ఉల్లంఘనలు జరిగినా ఉపేక్షించేది లేదని, కోర్టును ఆశ్రయించేందుకు కూడా వెనకాడబోమని తెలంగాణ ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ ఎన్నికల సంఘం సమన్వయ కమిటీ చైర్మన్‌ మర్రి శశిధర్‌రెడ్డి హెచ్చరించారు. కేంద్ర ఎన్నికల కమిషన్‌ ఆదేశాల మేరకు ఆపద్ధర్మ ప్రభుత్వంపై ఎన్నికల ప్రవర్తన నియమావళిని కట్టుదిట్టంగా అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. ఆదివారం గాంధీభవన్‌లో న్యాయవాది జంధ్యాల రవిశంకర్‌తో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. ఎన్నికల కమిషన్‌ నిష్పక్షపాతంగా, పారదర్శకంగా వ్యవహరించకపోతే ప్రజాస్వామ్యానికి ప్రమాదమని ఆందోళన వ్యక్తం చేశారు.

అసెంబ్లీ రద్దయిన వెంటనే ఆపద్ధర్మ సీఎం కేసీఆర్‌ ఎన్నికల షెడ్యూలు ప్రకటించారని, తదనుగుణంగా ఎన్నికల కమిషన్‌ నాలుగు మాసాల్లో పూర్తిచేయాల్సిన ఓట్ల సవరణ కార్యక్రమాన్ని నాలుగు వారాల్లో పూర్తి చేసేందుకు సిద్ధమైందని శశిధర్‌రెడ్డి విమర్శించారు. టీఆర్‌ఎస్‌ చెప్పినట్లు ఎన్నికల సంఘం పనులు చేయడం సరైంది కాదన్నారు. ముందస్తు ఎన్నికల పేరుతో రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని అపçహాస్యం చేస్తున్నారని, ఎన్నికల సంఘం సైతం చూసీచూడనట్టు వ్యవహరిస్తోందని మర్రి విమర్శించారు. ఓటర్ల జాబితా సవరణకు సరైన సమయం ఇవ్వలేదని, దీనిపై సుప్రీంకోర్టులో పోరాడుతున్నామన్నారు. ఎన్నికల పనులకోసం హరియాణా నుంచి వచ్చిన కానిస్టేబుల్‌ కొంపల్లి వద్ద హార్ట్‌ ఎటాక్‌తో చనిపోయాడని, దీన్ని బట్టి ఎన్నికల సిబ్బందిపై ఎంత ఒత్తిడి ఉందో అర్థం చేసుకోవచ్చని శశిధర్‌ పేర్కొన్నారు.

ప్రముఖ న్యాయవాది జంధ్యాల రవిశంకర్‌ మాట్లాడుతూ, గుజరాత్‌ హైకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం, ప్రభుత్వాన్ని రద్దు చేసిన పార్టీ ఆపద్ధర్మ ప్రభుత్వంగా కొనసాగడం తప్పన్నారు. ప్రభుత్వం రద్దయిన మరుక్షణమే ఎన్నికల కోడ్‌ అమల్లోకి వచ్చినా, ఆపద్ధర్మ ప్రభుత్వం జోరుగా శంకుస్థాపనలు చేసిందని ఆయన ఆరోపించారు. ఎన్నికల ప్రచార కార్యక్రమాలకు అధికార పార్టీ మంత్రులు యథేచ్ఛగా ప్రభుత్వ వనరులైన గన్‌మెన్, కార్లు, కాన్వాయ్, సైరన్‌లను వాడుతున్నారని దుయ్యబట్టారు. పోలీసు అధికారులను బదిలీచేసే అధికారం ఆపద్ధర్మ ప్రభుత్వానికి ఉండదన్నారు. ప్రభుత్వ సొమ్ముతో ఇప్పటికీ ప్రచార పనులు చేస్తున్నారని, దీనిని అరికట్టకుంటే న్యాయ పోరాటం చేస్తామని రవిశంకర్‌ హెచ్చరించారు. 

మరిన్ని వార్తలు