‘కేసీఆర్‌కు భయం పట్టుకుంది’

16 Oct, 2019 18:33 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: హుజూర్‌నగర్‌లో  గురువారం జరగనున్న సీఎం కేసీఆర్ సభ కోసం టీఆర్‌ఎస్‌  నిబంధనలకు విరుద్ధంగా భారీగా డబ్బు ఖర్చు చేస్తోందని కాంగ్రెస్‌ మాజీ మం​త్రి మర్రి శశిధర్‌రెడ్డి ఆరోపించారు.  ఈ మేరకు బుధవారం ఆయన ఎన్నికల సంఘం సీఈఓ రజత్‌కుమర్‌ను కలిసి పలు అంశాలపై  ఫిర్యాదు చేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘కేసీఆర్ కుటుంబ సభ్యులకు చెందిన ఓ టీవీ చానల్, ఇంగ్లీష్ పత్రికలో భారీగా టీఆర్‌ఎస్‌ అభ్యర్థి కోసం ప్రకటనలు ఇస్తున్నారని, ఈ ఖర్చును టీఆర్ఎస్ అభ్యర్థి ఖర్చుగానే చూడాలని ఈసీని కోరినట్లు చెప్పారు. ఈ ఉపఎన్నికలో పెద్ద ఎత్తున మద్యం, డబ్బు సరఫరా జరుగుతోందన్న విషయాన్ని రజత్ కుమార్‌ దృష్టికి తీసుకెళ్లినట్లు పేర్కొన్నారు.

అదేవిధంగా మంత్రులు మహమూద్ అలీ, జగదీశ్వర్‌రెడ్డిలు కోదాడలో నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనంలో ఎన్నికల కోడ్ ఉల్లంఘించారని తెలిపామన్నారు. ఎన్నికల కోడ్ ఉల్లంఘనలకు పాల్పడిన మంత్రులపై కేసులు నమోదు చెయాలని కోరామని వెల్లడించారు. కేసీఆర్ హుజూర్‌నగర్ సభలో ఎలాంటి విధానపరమైన ప్రకటనలు చేసినా చర్యలు తీసుకోవాలని ఎన్నికల సంఘం సీఈఓకు విజ్ఞప్తి చేశామని శశిధర్‌రెడ్డి తెలిపారు. హుజుర్ నగర్ ఉపఎన్నికలపై కేసీఆర్‌కు భయం పట్టుకుందని అందుకే తానే స్వయంగా ప్రచారానికి రావాల్సిన పరిస్థితి వచ్చిందని విమర్శించారు. ఆర్టీసీ కార్మికుల ఆత్మహత్యలకు సీఎం కేసీఆర్ బాధ్యత వహించాలన్నారు. కేసీఆర్ ఒళ్లు దగ్గరపెట్టుకొని పని చెయాలంటే హుజూర్‌నగర్‌లో కాంగ్రెస్‌పార్టీని గెలిపించాలని కోరారు. 

మరిన్ని వార్తలు