ఎన్నికలను వాయిదా వేయాలి: మర్రి

15 Oct, 2018 01:58 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌:  తుది ఓటర్ల జాబి తాలో దాదాపు 25 లక్షలమంది ఓట్లు గల్లంతయ్యాయని, దీనిని రుజువు చేసేందుకు సిద్ధంగా ఉన్నామని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత మర్రి శశిధర్‌రెడ్డి సవాల్‌ చేశారు. సాంకేతిక సమస్యలతో తుదిఓటర్ల జాబితాలో కేవలం 25 వేలమంది ఓటర్ల పేర్లు పునరావృతమయ్యాయని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి రజత్‌కుమార్‌ ప్రకటించడం హాస్యాస్పదంగా ఉందన్నారు. తప్పుడు ఓటరు జాబితాతో ఎన్నికలు సజావుగా జరగవని, ఎన్నికలను వాయిదా వేయాలని డిమాండ్‌ చేశారు. ఆదివారం గాంధీభవన్‌లో పార్టీ సీనియర్‌ నేత నిరంజన్‌తో కలసి ఆయన విలేకరులతో మాట్లాడారు. తుది ఓటర్ల జాబితా ప్రచురణకు సిద్ధంగా ఉన్నామని సీఈవో హైకోర్టును తప్పుదోవ పట్టించారని అన్నారు. ఈసీ పనితీరు మారకపోతే జాతీయ, ప్రపంచ మీడియా ముందు అసమర్థతను బహిర్గతం చేస్తామని అల్టిమేటం జారీచేశారు.

ఓటర్ల జాబితాలో లోపాలను సరిచేయకుండా పంతానికి పోయి ఎన్నికల షెడ్యూల్‌ను ఈసీ ప్రకటించడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయన్నారు. ఈసీ హైకోర్టుకు సమ ర్పించిన నివేదిక మేరకు కూడా రాష్ట్రంలో ఎన్నికల ప్రక్రియ అమలు కావడం లేదన్నారు. పార్టీలకు తుది ఓటరు జాబితా ప్రతులను ఇంతవరకు అందజేయలేదని, కనీసం అధికారిక వెబ్‌సైట్‌లో సైతం ఓటర్ల జా బితాలను పొందుపరచలేద ని తప్పుబట్టారు. ఎవరికీ సమాచారం ఇవ్వకుండా హైదరాబాద్‌లో ఈవీఎంలు నిల్వ చేసిన గోదాంను అధికారులు తెరవడంపై అనుమానం వ్యక్తం చేశారు. నిబంధనల ప్రకారం నోడల్‌ ఆఫీసర్‌ సమక్షంలో ఈవీఎంల సీలు తీసి, మళ్లీ సీలు వేసే వరకు వీడియో తీయాల్సి ఉందని, కానీ ఆచరణలో మాత్రం అమలు కావడం లేదని దుయ్యబట్టారు. ఎన్నికల సంఘం టీఆర్‌ఎస్‌తో కుమ్మక్కు అయిందని హైకోర్టులో న్యా యవాదులు సైతం వాదించారని గుర్తుచేశారు. అధికారుల తప్పుడు వ్యవహార శైలీతో ఎన్నికల ప్రక్రియ గందరగోళమైందని ఆందోళన వ్యక్తం చేశారు.    

మరిన్ని వార్తలు