మే మొదటి వారంలో పరిషత్‌ ఎన్నికలు!

12 Mar, 2019 05:20 IST|Sakshi

లోక్‌సభ ఎన్నికలు ముగియగానే నోటిఫికేషన్‌

ఈవీఎంలతోనే జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎలక్షన్లు

లోక్‌సభ కోడ్‌ ముగిసేలోపు

ఎన్నిక ప్రక్రియ పూర్తికి ఏర్పాట్లు

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలోని జిల్లా పరిషత్, మండల పరిషత్‌లకు మే నెల మొదటి వారంలో ఎన్నికలు జరిగే అవకాశాలు కనబడుతున్నాయి. లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్‌ ప్రకారం తొలిదశలోనే (ఏప్రిల్‌ 11) తెలంగాణలో పోలింగ్‌ ప్రక్రియ పూర్తవుతోంది. లోక్‌సభ ఎన్నికలు ముగియగానే పరిషత్‌ ఎన్నికలు నిర్వహించేలా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఏప్రిల్‌ రెండో నోటిఫికేషన్‌  ఇచ్చి.. దీనికి అనుగుణంగానే ఎన్నికలు నిర్వహించేలా రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్‌ఈసీ) ఏర్పాట్లు చేస్తోంది.

దేశవ్యాప్తంగా లోక్‌సభ ఎన్నికల కోడ్‌ అమలు గడువు ముగిసేలోపు (మే 25) జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల ప్రక్రియను ముగించేలా ఈ ఏర్పాట్లు జరుగుతున్నాయి. డిసెంబరులో అసెంబ్లీ, జనవరిలో గ్రామపంచాయతీ ఎన్నికలు జరిగాయి. ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్నాయి. తాజాగా లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్‌ వచ్చింది. ఇలా వరుస ఎన్నికల నేపథ్యంలో నెలల తరబడి ఎన్నికల నియమావళి అమల్లో ఉంటోంది. దీంతో రాష్ట్రంలో అభివృద్ధి కార్యక్రమాల పురోగతి ఉండటంలేదు. ఈ నేపథ్యంలో పరిషత్‌ ఎన్నికలను త్వరగా ముగించాలని ప్రభుత్వ వర్గాలు భావిస్తున్నాయి.

ఈవీఎంలతో
పరిషత్‌ ఎన్నికల్లో ఈసారి ఎలక్ట్రానిక్‌ ఓటింగ్‌ యం త్రాలు (ఈవీఎం) ఉపయోగించాలనే ఆలోచనలో ఎస్‌ఈసీ ఉంది. సోమవారం రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ వి.నాగిరెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన అఖిలపక్ష సమావేశంలో ఈ అంశం చర్చకు వచ్చింది. దీనిపై టీఆర్‌ఎస్, తదితర పార్టీల నుంచి సానుకూలత వ్యక్తమైనట్టు సమాచారం. ఈ ఎన్నికలు రెండువిడతల్లో నిర్వహించాలని ఎస్‌ఈసీ భావిస్తోంది. త్వరలో నిర్వహించనున్న మున్సిపల్‌ ఎన్నికల్లోనూ ఈవీఎంలను ఉపయోగించాలనే ఆలోచనతో ఎస్‌ఈసీ ఉన్నట్టు తెలుస్తోంది. ఈ ప్రతిపాదనకు కూడా అన్ని పార్టీలనుంచి ఆమోదం వచ్చినట్లు సమాచారం.

వేగంగా ఏర్పాట్లు
పరిషత్‌ ఎన్నికలకోసం ఎస్‌ఈసీ ఏర్పాట్లును వేగవంతం చేసింది. వచ్చే జూలై 4న కొత్త జడ్పీలు, ఎంపీపీ పాలకవర్గాలు ఏర్పడేందుకు అనువుగా ఏర్పాట్లు చేస్తోంది. గతంలోని పాత 9 జడ్పీల స్థానంలో 32 జడ్పీల చైర్‌పర్సన్లు, వాటి పరిధిలోని 535 గ్రామీణ రెవెన్యూ మండలాల పరిధిలో ఎంపీపీ అధ్యక్ష స్థానాల్లో ఎస్టీ, ఎస్సీ, బీసీ రిజర్వేషన్లు కూడా ఖరారయ్యాయి. కొత్త జడ్పీలు, ఎంపీపీల పరిధిలోని జడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాల పునర్విభజన కూడా పూర్తయింది. కొత్త పంచాయతీరాజ్‌ చట్టానికి అనుగుణంగా జడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాల సరిహద్దులు ఖరారయ్యాయి.

32 జడ్పీలు, 535 ఎంపీపీలు
ఈ ఎన్నికల నిర్వహణకు సంబంధించిన వివిధ ప్రక్రియను పూర్తిచేయడంలో భాగంగా ఇప్పటికే పాత 9 జడ్పీల స్థానంలో జిల్లాల పునర్విభజనకు అనుగుణంగా 32 జడ్పీలు, వాటి పరిధిలోని 535 గ్రామీణ రెవెన్యూ మండలాలను ఎంపీపీలుగా పునర్విభజన పూర్తిచేశారు. 32 జడ్పీ చైర్‌పర్సన్లు, 535 ఎంపీపీలకు సంబంధించి ఎస్టీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లు కూడా ఖరారుచేశారు. రాష్ట్రవ్యాప్తంగా 32 జిల్లాల్లో మొత్తం 5,984 ఎంపీటీసీ స్థానాలు ఏర్పడనున్నట్టు సమాచారం. కొత్తగా 68 మున్సిపాటిలీలు ఏర్పడిన నేప థ్యంలో ఆయా మండలాల పరిధిలోని కొన్ని గ్రామ పంచాయతీలను వాటిలో విలీనం చేయడంతో రాష్ట్రవ్యాప్తంగా 489 ఎంపీటీసీ స్థానాలు తగ్గాయి.

27న ఓటర్ల తుది జాబితా
ఈ నెల 27న రాష్ట్రంలో గ్రామపంచాయతీల వారీగా ఫొటోలతో కూడిన ఓటర్ల తుది జాబితాలను సిద్ధం చేయాలని అధికారులను ఎస్‌ఈసీ ఇదివరకే ఆదేశించింది. తుది జాబితా సిద్ధం చేసి మార్చి 27న ప్రచురించాలని గతంలోనే నోటిఫికేషన్‌  విడుదల చేసింది. కొత్త పంచాయతీరాజ్‌ చట్టంలో సూచించిన మేరకు వార్డుల విభజన పూర్తిచేయాలని ఆదేశాలొచ్చాయి. ఈ నెల 16న వార్డుల వారీగా విభజించిన గ్రామపంచాయతీ ముసాయిదా ఫొటో ఓటర్ల జాబితాను సిద్ధం చేసి గ్రామపంచాయతీ, మండల ప్రజా పరిషత్‌ కార్యాలయంలో ప్రదర్శించాల్సి ఉంటుంది. ఈ జాబితాలపై వివిధ ప్రక్రియలను నిర్వహించాక 27న డీపీవో చేసిన వార్డుల విభజనకు అనుగుణంగా గ్రామపంచాయతీ ఫొటో ఓటర్ల తుది జాబితా ప్రచురించాలి.

మరిన్ని వార్తలు