‘త్వరలోనే ఎన్డీయేకు మరోపార్టీ గుడ్‌బై’

19 Dec, 2018 15:17 IST|Sakshi

 పట్నా: బిహార్‌ సీఎం నితీష్‌ కుమార్‌ అహంకారం కారణంగానే తాను ఎన్డీయే కూటమి నుంచి బయటకు వచ్చానని రాష్ట్రీయ లోక్‌సమాత పార్టీ (ఆర్‌ఎస్‌ఎల్పీ) అధినేత, మాజీ కేంద్రమంత్రి ఉపేంద్ర కుష్వాహా తెలిపారు. ఎన్డీయే నేతల మధ్య ఏకభిప్రాయంలేదని, త్వరలోనే లోక్‌జన శక్తి పార్టీ (ఎల్‌జేపీ) కూడా బీజేపికు గుడ్‌బై చెప్పే అవకాశం ఉందని ఆయన వెల్లడించారు. బీజేపీ, జేడీయూల మధ్య సీట్ల కేటాయింపులపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఎన్డీయే కూటమి నుంచి ఉపేంద్ర బయటకు వచ్చి  కేంద్రమంత్రి పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే.

కుష్వాహా బుధవారం పట్నాలో మీడియాతో మాట్లాడుతూ.. కూటమిలో కొత్తగా చేరిన నితీష్‌ వ్యవహారంతోనే తాను బయటకు వచ్చినట్లు పేర్కొన్నారు. బీజేపీ, జేడీయూ మధ్య సీట్ల పంపకాల విషయంలో ఎల్‌జేపీ కూడా అసంతృప్తితో ఉందని, రాంవిలాస్‌ పాశ్వాన్‌ కూడా బయటకు త్వరలోనే బయటకు వస్తారని అన్నారు. కాగా నితీష్‌, అమిత్‌షా మధ్య లోక్‌సభ ఎన్నికల సీట్ల సర్దుబాటు చర్చలతో బిహార్‌ ఎన్డీయే కూటమిలో చీలిక వచ్చిన విషయం తెలిసిందే. ఎల్‌జేపీ కూడా గుడ్‌బై చెప్పితే బిహార్‌లో బీజేపీకి పెద్ద నష్టమే జరుగుతుందని ఆపార్టీ నేతలు అభిప్రాయపడుతున్నారు.
 

>
మరిన్ని వార్తలు