జ్యోతిరాదిత్య చేతికే పగ్గాలు!

28 Sep, 2017 19:43 IST|Sakshi

ధ్యప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా పద్నాలుగు నెలల సమయం ఉన్నప్పటికీ కాంగ్రెస్‌ పార్టీలో నాయకత్వపోరు తుదిఘట్టానికి చేరింది. 2003 నుంచి వరుసగా మూడు పర్యాయాలు అధికారం చేపట్టిన బీజేపీపై ప్రజా వ్యతిరేకత తీవ్రంగా ఉంటుందని.. ఇది తమకు లాభిస్తుందని కాంగ్రెస్‌ భావిస్తోంది. ఈ ఏడాది జూన్‌లో మందసౌర్‌లో పోలీసు కాల్పుల్లో ఐదుగురు రైతులు చనిపోవడం, గిట్టుబాటు ధరలు లేకపోవడం తదితర కారణాల వల్ల రైతాంగం బీజేపీపై ఆగ్రహంగా ఉంది. వీటన్నింటినీ దష్టిలో పెట్టుకొని ఐకమత్యంగా ముందుకు సాగితే విజయం సాధించగలమని కాంగ్రెస్‌ అధిష్టానం అంచనా వేస్తోంది. అందుకే పార్టీలోని వైరివర్గాలను ఏకతాటి పైకి తేవాలని చూస్తోంది. 

సీఎం అభ్యర్థిగా ఎవరిని ప్రకటించినా వర్గపోరుతో పార్టీ ప్రయోజనాలు దెబ్బతింటాయని మొదట సోనియాగాంధీ, రాహుల్‌లు భావించారు. అయితే దాదాపు పన్నెండేళ్లుగా సీఎంగా కొనసాగుతున్న శివరాజ్‌సింగ్‌  చౌహన్‌ను ఎదుర్కొనాలంటే సీఎం అభ్యర్థిని ప్రకటించాల్సిందేనని మధ్యప్రదేశ్‌ కాంగ్రెస్‌ శ్రేణులు గట్టిగా కోరుతున్నాయి. పంజాబ్‌లో అమరీందర్‌ను సీఎం అభ్యర్థిగా ప్రకటించి విజయం సాధించడం కూడా కాంగ్రెస్‌ను పునరాలోచనలో పడేసింది. ఈ ఏడాది జూన్‌లో సోనియాగాంధీని కలిసిన మధ్యప్రదేశ్‌ కాంగ్రెస్‌ అగ్రనేతలు కమల్‌నాథ్, దిగ్విజయ్‌సింగ్, జ్యోతిరాదిత్య సింధియాలు... ఎవరిని సీఎం అభ్యర్థిగా ప్రకటించినా కలిసి పనిచేస్తామని, వ్యక్తిగత ప్రయోజనాలను పక్కనబెట్టి పార్టీ విజయం కోసం శ్రమిస్తామని హామీ ఇచ్చారు. ఇటీవల కాంగ్రెస్‌ ఏ కార్యక్రమం చేపట్టినా అగ్రనేతలందరూ హాజరవుతున్నారు. 1993 ఎన్నికలకు ముందు గ్వాలియర్‌కు సమీపంలోని దాబ్రాలో మాట్లాడుతూ కాంగ్రెస్‌లోని వర్గాలన్నీ కలిసికట్టుగా పనిచేయాలని పిలుపిచ్చారు. అప్పుడు అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ పదేళ్లు రాష్ట్రాన్ని పాలించింది. ఇప్పుడలాగే ‘దాబ్రా స్ఫూర్తి’తో ముందుసాగాలని కాంగ్రెస్‌ భావిస్తోంది.

యువ ఎంపీవైపే మొగ్గు...
సీఎం అభ్యర్థిగా పోటీ ప్రధానంగా ఇద్దరి మధ్యే ఉంది. కమల్‌నాథ్, జ్యోతిరాదిత్య సింధియాలు దీన్ని ఆశిస్తున్నారు. అయితే గ్వాలియర్‌ రాజవంశానికి చెందిన 46 ఏళ్ల జ్యోతిరాదిత్య వైపే కాంగ్రెస్‌ అధిష్టానం మొగ్గు చూపుతోంది. దివంగత మాధవరావు సింధియా కుమారుడైన జ్యోతిరాదిత్య చరిష్మా కలిగిన నాయకుడు. కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీకి అత్యంత సన్నిహితుడు. యువతరాన్ని ప్రోత్సహించాలని గట్టిగా వాదించే రాహుల్‌... జనాదరణను కూడా దష్టిలో పెట్టుకొని జ్యోతిరాదిత్యకే పగ్గాలు అప్పగించే అవకాశాలున్నాయి. ఎన్నికలకు ముందు సీఎం అభ్యర్థిని ప్రకటించాల్సిన అవసరం లేదని కొంతకాలం కిందటివరకు వాదించిన కమల్‌నాథ్‌ బుధవారం గుణ జిల్లా కేంద్రంలో విలేకరులతో మాట్లాడుతూ...

‘సింధియాజీని సీఎం అభ్యర్థిగా ప్రకటించాలి. ఆయన నాయకత్వంలో పనిచేయడానికి నాకెలాంటి అభ్యంతరం లేదు’ అని అన్నారు. జ్యోతిరాదిత్య చేతికి పగ్గాలు అప్పగించడానికి రంగం సిద్ధమైపోయిందనేందుకు కమల్‌నాథ్‌ వ్యాఖ్యలు సంకేతమని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. తాను సీఎం అభ్యర్థి రేసు నుంచి వైదొలుగుతున్నట్లు కమల్‌నాథ్‌ పరోక్షంగా వెల్లడించారని భావిస్తున్నారు. దసరా తర్వాత కాంగ్రెస్‌ ఈ మేరకు ప్రకటన చేయవచ్చని, లేదా రాహుల్‌గాంధీ కాంగ్రెస్‌ అధ్యక్షబాధ్యతలు చేపట్టాక జ్యోతిరాదిత్య పేరును ప్రకటించొచ్చని ప్రచారం జరుగుతోంది.

ఆఖరి ఛాన్స్‌ కోసం ఆశపడ్డ కమల్‌నాథ్‌
నిజానికి కమల్‌నాథ్‌ తాను సీఎం అభ్యర్థి కావాలని గట్టిగానే కోరుకున్నారు. చాన్నాళ్లుగా మధ్రప్రదేశ్‌ను చుట్టేస్తున్నారు. అయితే అధిష్టానం ఆలోచనలు భిన్నంగా ఉన్నాయని తెలియడం... మరోవైపు దిగ్విజయ్‌ తెరపైకి వచ్చే యత్నాలు చేస్తుండటంతో కమల్‌నాథ్‌ బుధవారం బాహటంగా జ్యోతిరాదిత్యకు మద్దతు ప్రకటించారు. కమల్‌నాథ్‌ సీనియర్‌ పార్లమెంటేరియన్‌. మధ్యప్రదేశ్‌లోని చింద్వారా నియోజకవర్గం నుంచి వరుసగా తొమ్మిదోసారి లోక్‌సభకు ఎన్నికయ్యారు. పీవీ నరసింహారావు మంత్రివర్గంలో సహాయమంత్రిగా పనిచేసిన కమల్‌నాథ్‌ 2004 నుంచి 2014 కేంద్ర వాణిజ్య, ఉపరితల రవాణా, పట్టణాభివద్ధి, పార్లమెంటరీ వ్యవహారాల కేబినెట్‌ మంత్రిగా పదేళ్లు వివిధ బాధ్యతలు చూశారు.

ఇప్పుడాయనకు 70 ఏళ్లు. జ్యోతిరాదిత్య యువకుడు కాబట్టి ఆయనకు భవిష్యత్తులో అవకాశాలు వస్తాయని... ఇప్పుడు తనను సీఎం అభ్యర్థిగా ప్రకటించాలని కమల్‌నాథ్‌ కోరుకున్నారు. ఈయనకు కాంగ్రెస్‌లో ట్రబుల్‌ షూటర్‌గానూ పేరుంది. కాంగ్రెస్‌కు ఆర్థిక వనరులను సమీకరించడంలోనూ ఈయనదే కీలకపాత్ర. బహుశా జనాదరణలో శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌కు సరితూగలేరనేది కాంగ్రెస్‌ పెద్దల అభిప్రాయం కావొచ్చు. అదికాకుండా జ్యోతిరాదిత్యకు రాహుల్‌తో ఉన్న సాన్నిహిత్యం కూడా ఈ వెటరన్‌ను సీఎం అభ్యర్థి రేసులో వెనక్కినెట్టింది. 

ఉనికి చాటే యత్నంలో దిగ్విజయ్‌
1993 నుంచి 2003 దాకా మధ్యప్రదేశ్‌ సీఎంగా పనిచేసిన దిగ్విజయ్‌ సింగ్‌ తర్వాత కేంద్రానికి మారారు. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శిగా పలు రాష్ట్రాలకు ఇంఛార్జిగా పనిచేశారు. రాహుల్‌కు రాజకీయ పాఠాలు బోధించారు. అయితే తరచూ వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం, ఇతర కారణాల వల్ల దిగ్విజయ్‌ బాధ్యతలను అధిష్టానం క్రమేపీ తగ్గిస్తూ వస్తోంది. ఈ ఏడాది మార్చిలో గోవాలో జరిగిన ఎన్నికల్లో 40 సీట్లకు గాను కాంగ్రెస్‌ 17 సీట్లు గెలిచి అతిపెద్ద పార్టీగా అవతరించినా... ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమయ్యే మరో నలుగురు ఎమ్మెల్యేల మద్దతును కూడగట్టడంలో దిగ్విజయ్‌ విఫలమయ్యారు. తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఏప్రిల్‌ 29న ఆయనను గోవా, కర్ణాటక రాష్ట్రాల ఇంచార్జి పదవి నుంచి తప్పించారు.

అనంతరం ఆగష్టు ఒకటిన తెలంగాణ ఇంచార్జి పదవి నుంచి కూడా తొలగించారు. పదేళ్లు సీఎంగా పనిచేసిన డిగ్గీరాజాకు మధ్యప్రదేశ్‌ కాంగ్రెస్‌లో మంచి పట్టే ఉంది. తనను అంత తేలికగా తీసిపారేయడానికి వీలులేదని సంకేతాలు పంపుతూ... ఉనికిని చాటుకునేందుకు దిగ్విజయ్‌ నర్మదా నది పరివాహక ప్రాంతంలో ‘నర్మదా పరిక్రమ’ పేరిట 3,400 కిలోమీటర్ల పాదయాత్రను ఈనెల 30న మొదలుపెట్టనున్నారు. రాజకీయాలతో సంబంధం లేదని, కాంగ్రెస్‌ జెండాలు ఉండవని, సభలు, ఉపన్యాసాలు ఉండవని దిగ్విజయ్‌ చెప్పారు. అయితే సుమారు 100 నియోజకవర్గాల మీదుగా సాగే ఈ పాదయాత్రలో దిగ్విజయ్‌ జనం వద్దకే వెళ్లి వాళ్లతో మాట్లాడనున్నారు. ఎప్పుడో కొన్నేళ్ల కిందట సంకల్పించినా... ఇప్పటికి చేపట్టగలుగుతున్నాయని దిగ్విజయ్‌ చెబుతున్నా... కాంగ్రెస్‌కు ఈ పాదయాత్ర ఉపయోగపడుతుందని భావిస్తున్నారు. మరోవైపు దిగ్విజయ్‌కి తన ఉనికిని చాటేందుకు పనికి వస్తుంది.
 

(సాక్షి నాలెడ్జ్‌ సెంటర్‌)

మరిన్ని వార్తలు