నివురుగప్పిన నిప్పులా అసమ్మతి!

14 Sep, 2019 08:34 IST|Sakshi

పార్టీకి గుడ్‌బై చెప్పే ఆలోచనలో కొందరు ఎమ్మెల్యేలు  

బీజేపీ నేతలతో చెట్టాపట్టాల్‌ ?

బెంగళూరు: జేడీఎస్‌ పార్టీలో నివురుగప్పిన నిప్పులా ఉన్న అసమ్మతి బహిర్గతం అయ్యే సంకేతాలు కనిపిస్తున్నాయి. మాజీ ప్రధాని దేవెగౌడ, మాజీ సీఎం కుమారస్వామి తీరుపై అసంతృప్తితో ఉన్న ఆ పార్టీకి చెందిన ఆరుగురు ఎమ్మెల్యేలు జేడీఎస్‌ను వీడనున్నట్లు సమాచారం. ఇప్పటికే పార్టీ మారాలని నిర్ణయించుకున్న ఈ ఆరుగురు ఎమ్మెల్యేలు ఎప్పడు ఏ రకంగా బాంబు పేల్చుతారోనని పార్టీ పెద్దలు ఆలోచనలో పడ్డారు. రాష్ట్రంలో సంకీర్ణ ప్రభుత్వం పతనం కావడంతో జేడీఎస్‌ పార్టీకి చెందిన ఎమ్మెల్యేల్లో అసమ్మతి మరింత తారా స్థాయికి చేరింది. మంత్రిగా పని చేసిన జీ.టి. దేవెగౌడ.. సంకీర్ణ సర్కార్‌ పతనం తర్వాత జేడీఎస్‌కు దూరంగా ఉంటున్నారు. ఈయన బీజేపీ నేతలతో టచ్‌లో ఉంటున్నట్లు సమాచారం. మరో ఆరుగురు కూడా అదే దారిలో ఉన్నట్లు సమాచారం. పార్టీకి, ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేసి అనంతరం బెర్తులు ఖరారు చేసుకునే పనిలోపడ్డారు.  

బీజేపీ నేతలతో జీటీ దేవెగౌడ చెట్టాపట్టాల్‌ 
గత శాసనసభ ఎన్నికల్లో మాజీ సీఎం.హెచ్‌డి.కుమార స్వామితో కలిసి మొత్తం జేడీఎస్‌ పార్టీ 37 మంది శాసన సభ్యులు విజయం సాధించారు. ఆపరేషన్‌ కమలం నేపథ్యంలో ఎమ్మెల్యే హెచ్‌ విశ్వనాథ్, మహాలక్ష్మి లేఔట్‌ ఎమ్మెల్యే గోపాలయ్య, కేఆర్‌పేట ఎమ్మెల్యే నారాయణగౌడలు పార్టీని వీడారు. వీరిపై అనర్హత వేటు పడింది. దీంతో జేడీఎస్‌ బలం 34కు చేరింది. వీరిలో మరో ఆరుగురు రాజీనామాలకు సిద్ధమవుతున్నట్లు సంకేతాలు అందుతున్నాయి. అదేవిధంగా మాజీ మంత్రి చెన్నిగప్ప కుమారుడు బీ.సీ.గౌరి శంకర్‌ కూడా పార్టీని వీడే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. సంకీర్ణ ప్రభుత్వం పతనమైనప్పటి నుంచి మాజీ మంత్రి జీటీ దెవెగౌడ.. ప్రధాని నరేంద్రమోదీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు, హోం మంత్రి అమిత్‌షాలను నిరంతరం పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. మైసూరులో బీజేపీ నాయకులతో చెట్టాపట్టాలు వేసుకొని తిరుగుతున్నారు. అప్పడపుడు సీఎంను కూడా కలుస్తున్నారు. మాజీమంత్రి, ఎమ్మెల్యే అయిన గుబ్బి శ్రీనివాస్‌ ఇటీవల మాజీ మంత్రి డీకే. శివకుమార్‌కు మద్దతుగా ధర్నాలో పాల్గొన్నారు. ధర్నాకు హాజరు కాని మాజీ సీఎం కుమారస్వామిపై ఆరోపణలు చేశారు.     

వీడేది వీరేనా ?  
జీటీ దేవెగౌడ (చాముండేశ్వరి), ఆర్‌.శ్రీనివాస్‌ (గుబ్బి), శివలింగేగౌడ (ఆరిసికెరె), మహాదేవ్‌ (పిరియాపట్టణ), సురేష్‌గౌడ (నాగమంగల), రవీంద్ర శ్రీకంఠయ్య (శ్రీరంగపట్టణ), సత్యనారాయణ (సిరా)లు పార్టీ వీడటానికి సిద్ధంగా ఉన్నట్లు సమాచారం.  

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా