ములాయం తరఫున ప్రచారం చేయనున్న మాయావతి

16 Mar, 2019 15:15 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: యూపీ రాజకీయాల్లో దిగ్గజాలైన బీఎస్పీ అధినేత్రి మాయావతి, ఎస్పీ సుప్రీం ములాయం సింగ్‌ యాదవ్‌ మధ్య దశాబ్దాలు సాగిన బద్ధవైరానికి త్వరలోనే అధికారికంగా ముగింపు పడబోతోంది. ములాయం సింగ్‌తోనే వేదిక పంచుకోవడమే కాదు.. ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న మెయిన్‌పురి నియోజకవర్గంలో ఆయన తరఫున మాయావతి ప్రచారం నిర్వహించబోతున్నారు. ఏప్రిల్‌ 19వ తేదీన ఎస్పీ మెయిన్‌పురిలో నిర్వహించనున్న సభకు హాజరుకావాలని మాయావతి నిర్ణయించారు.

యూపీ రాజకీయాలను కుదిపేసిన 1995 నాటి గెస్ట్‌హౌస్‌ సంఘటన తర్వాత మాయావతి, ములాయం సింగ్‌ యాదవ్‌ ఎప్పుడు కలిసి పనిచేయలేదు. అప్పట్లో గెస్ట్‌హౌస్‌లో మాయావతి ఉండగా.. ఎస్పీ కార్యకర్తలు, నేతలు దాడులు జరిపారు. అయితే, ప్రస్తుతం మారిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఆ శత్రుత్వాన్ని పక్కనబెట్టి.. ఎస్పీ-బీఎస్పీ లోక్‌సభ ఎన్నికల కోసం పొత్తు పెట్టుకున్న సంగతి తెలిసిందే. యూపీలో మోదీని, బీజేపీని నిలువరించేందుకు ఈ రెండు పార్టీలు చేతులు కలిపాయి. అయితే, గెస్ట్‌హౌస్‌ అవమానాన్ని మరిచిపోయి.. మాయావతి ఎస్పీతో చేతులు కలిపిందని బీజేపీ చేస్తున్న విమర్శల దాడిని తిప్పికొట్టేందుకు ములాయంతో వేదిక పంచుకునేందుకు మాయావతి సిద్ధమయ్యారు. ఎస్పీ-బీఎస్పీ పొత్తులో భాగంగా అఖిలేశ్‌, మాయావతి కలిసి యూపీలో మొత్తం 11 ర్యాలీల్లో సంయుక్తంగా పాల్గొనబోతున్నారు.

మరిన్ని వార్తలు