రాష్ట్రంలోని మహిళకు భద్రత లేదు : మాయావతి

7 Dec, 2019 15:32 IST|Sakshi

లక్నో : ఉన్నావ్‌ బాధితురాలు మరణంపై ఉత్తరప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి బీఎస్పీ అధినేత మాయావతి స్పందించారు. రాష్ట్రంలోని మహిళలకు రక్షణ కల్పించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని బీజేపీ సర్కారుపై మండిపడ్డారు. గురువారం కోర్టు విచారణకు వెళ్తున్న ఉన్నావో బాధితురాలిని రైల్వేస్టేషన్‌ సమీపంలో నిందితులు అడ్డుకొని పెట్రోల్‌ పోసి నిప్పంటించిన విషయం తెలిసందే. 90 శాతం కాలిన గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితురాలు శుక్రవారం రాత్రి మరణించింది. ఈ నేపథ్యంలో బీజేపీ ప్రభుత్వంపై మాయావతి విరుచుకుపడ్డారు. బీజేపీ ప్రభుత్వంలో మహిళలు సురక్షితంగా లేరని వ్యాఖ్యానించారు. యూపీ గవర్నర్‌ ఆనందీ బెన్‌ పటేల్‌ కూడా ఒక మహిళేనని, మరో మహిళ బాధలను ఆమె అర్థం చేసుకోగలరని తెలిపారు. రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న దాడులపై ప్రత్యేక చర్యలు తీసుకోవాలని గవర్నర్‌ను కోరారు.

మహిళల భద్రత విషయంలో ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని మాయావతి మండిపడ్డారు. గత కొన్ని సంవత్సరాలుగా మహిళలపై దాడులు జరగకుండా ఒక్కరోజు కూడా గడవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ ఉన్నావ్‌లో బాధితురాలు కుటుంబాన్ని కలిసి పరామర్శించారు. మరో వైపు సమాజ్ వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ సైతం అసెంబ్లీ ఆవరణలో నిరసన చేపట్టారు. ఇక యువతికి నిప్పంటించిన కేసును ఫాస్ట్ ట్రాక్ కోర్టుతో విచారించనున్నట్లు  ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తెలిపారు.

మరిన్ని వార్తలు