కాంగ్రెస్‌, బీజేపీలకు గుణపాఠమే: మాయావతి

15 Jan, 2019 12:58 IST|Sakshi

లక్నో: ఉత్తర ప్రదేశ్‌ మాజీ సీఎం, బీఎస్పీ అధినేత్రి మాయావతి తన 63వ జన్మదిన వేడుకలను మంగళవారం లక్నోలో జరుపుకున్నారు. ఆమె పుట్టిన రోజు సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీలపై విమర్శల వర్షం కురిపించారు. దేశంలో పేదరికం పెరుగుదలకు బీజేపీ, కాంగ్రెస్‌ పాలకులే కారణమని ఆమె మండిపడ్డారు. రానున్న లోక్‌సభ ఎన్నిలల్లో బీజేపీని ఓడించడమే తమ ముందున్న ప్రధాన లక్ష్యమనీ, గతాన్ని మర్చిపోయి ఎస్పీ, బీఎస్పీ కార్యకర్తలు విజయం కోసం శ్రమించాలని మాయావతి కోరారు.

వచ్చే ఎన్నికల్లో యూపీ ప్రజలు బీజేపీకి పెద్ద గుణపాఠమే చెప్తారని మాయావతి హెచ్చరించారు. ప్రధాని నరేంద్ర మోదీ కేంద్ర ప్రభుత్వ సం‍స్థలను దుర్వినియోగపరుస్తూ ప్రతిపక్షాలపై దాడులకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. ఎస్పీ చీఫ్‌ అఖిలేష్‌ యాదవ్‌పై జరిపిన సీబీఐ దాడులను రాజకీయ కక్ష్యసారింపు చర్యగా ఆమె వర్ణించారు. సంక్షేమ పథకాలను అమలు చేయ్యలేని మోదీ బహిరంగ సభలు నిర్వహించి తప్పుడు ప్రచారం చేసుకుంటున్నారని విమర్శించారు.

బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌లు కలిసి దేశంలో మతం, కులం ప్రాతిపదికన రాజకీయాలు చేస్తున్నాయని విమర్శించారు. మోదీ, బీజేపీపై తీవ్రంగా విరుచుకుపడిన మాయావతి కాంగ్రెస్‌ను సైతం వదలిపెట్టలేదు. ఇటీవల వెలువడిన ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు కేవలం బీజేపీకే కాకుండా కాంగ్రెస్‌కు కూడా గుణపాఠం నేర్పాయని గుర్తుచేశారు. దేశాన్ని 50 ఏళ్లకు పైగా పాలించిన కాంగ్రెస్‌ పాలనతో దేశం ఏమాత్రం అభివృద్ధి చెందలేదని విమర్శించారు. కాగా కాంగ్రెస్‌ను పక్కన పెట్టి ఎస్పీ, బీఎస్పీలు కూటమిగా ఏర్పడిన విషయం తెలిసిందే. నేడు మాయావతి పుట్టిన రోజు సందర్భంగా ఆమెకు పలువరు నేతలు శుభాకాంక్షలు తెలిపారు.

మరిన్ని వార్తలు