ముస్లింలకు మాయావతి ఓపెన్‌ అప్పీల్‌!

7 Apr, 2019 15:06 IST|Sakshi
దియోబంద్‌ ర్యాలీలో అఖిలేశ్‌, మాయావతి

సాక్షి, దియోబంద్‌ : బహుజన్‌ సమాజ్‌ పార్టీ (బీఎస్పీ) అధ్యక్షురాలు మాయావతి ఉత్తరప్రదేశ్‌లోని ముస్లింలకు బహిరంగంగా అప్పీల్‌ చేశారు. కాంగ్రెస్‌ పార్టీకి ఓటు వేసి.. ముస్లిం ఓట్ల చీలికకు కారణం కావొద్దని, బీజేపీని ఎస్పీ, బీఎస్పీ నేతృత్వంలోని మహాకూటమి మాత్రమే ఓడించగలదని, కాబట్టి మహాకూటమికే ముస్లింలు ఓటు వేయాలని ఆమె పిలుపునిచ్చారు. దియోబంద్‌లో ఎస్పీ, బీఎస్పీ కూటమి ఉమ్మడిగా నిర్వహించిన ర్యాలీలో మాయావతి ఈ మేరకు ముస్లింలను తమవైపు తిప్పుకునే ప్రయత్నం చేశారు. ఈ ర్యాలీలో మాయావతితోపాటు ఎస్పీ అధినేత అఖిలేశ్‌ యాదవ్‌, ఆరెల్డీ చీఫ్‌ అజిత్‌ సింగ్‌ తదితరులు పాల్గొన్నారు.

‘ముస్లింలకు నేను బహిరంగంగా పిలుపునిస్తున్నాను. బీజేపీని కాంగ్రెస్‌ కాదు మహాకూటమి మాత్రమే ఓడించగలదు. మహాకూటమి గెలువకూడదని కాంగ్రెస్‌ పార్టీ కోరుకుంటోంది. ఈ ఎన్నికల్లో బీజేపీకి  కాంగ్రెస్‌ పార్టీ సహకరించేందుకు ప్రయత్నిస్తోంది’ అని మాయావతి మండిపడ్డారు. సహరాన్‌పూర్‌లో కాంగ్రెస్‌ పార్టీ కూడా ముస్లిం అభ్యర్థిని నిలబెట్టడాన్ని ఆమె తీవ్రంగా తప్పుబట్టారు. ‘మొదట సహరాన్‌పూర్‌లో మేం ముస్లిం అభ్యర్థిని నిలబెట్టాం. ఆ తర్వాత కాంగ్రెస్‌ కూడా ముస్లిం అభ్యర్థినే నిలబెట్టింది. మా కూటమికే వచ్చే ఓట్లను తగ్గించడానికే కాంగ్రెస్‌ ఇలా చేస్తోంది’ అని ఆమె మండిపడ్డారు.

మరిన్ని వార్తలు