కాంగ్రెస్‌కు షాకిచ్చిన మాయావతి!

3 Oct, 2018 19:10 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : అధికార బీజేపీని ఓడించడమే లక్ష్యంగా బీఎస్పీతో పొత్తు పెట్టుకోవాలని భావించిన కాంగ్రెస్‌కు మాయావతి షాక్‌ ఇచ్చారు. ఈ ఏడాది చివర్లో జరగనున్న మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీతో పొత్తు పెట్టుకునే ప్రసక్తే లేదని ఆమె తేల్చి చెప్పారు. కొందరు కాంగ్రెస్‌ నేతలు అహంకారపూరితంగా వ్యవహరించినందువల్లే గుజరాత్‌ వంటి రాష్ట్రాల్లో ఆ పార్టీ అధికారానికి దూరమైందంటూ బీఎస్పీ అధినేత్రి ఘాటుగా విమర్శించారు.

బుధవారం మీడియాతో మాట్లాడిన మాయావతి.. ‘సరైన కూటమిని ఏర్పాటు చేయడంలో కాంగ్రెస్‌ విఫలమైనట్లుగా కన్పిస్తోంది. అసలు బీజేపీని ఓడించాలనే ఉద్దేశం వారికి ఉందో లేదోనన్న విషయంపై స్పష్టత లేదు. అందుకే కర్ణాటక, చత్తీస్‌గఢ్‌లలో వారికి దూరంగా ఉన్నాం. చిన్న పార్టీలను పూర్తిగా నామరూపాల్లేకుండా చేయడానికి కాంగ్రెస్‌ ప్రయత్నిస్త్నుట్లు అన్పిస్తోంది’ అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు.

కాగా రాజస్థాన్‌, మధ్యప్రదేశ్‌ కాంగ్రెస్‌ పెద్దలను  విమర్శించిన మాయావతి కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ, యూపీఏ చైర్‌పర్సన్‌ సోనియా గాంధీలపై మాత్రం ప్రశంసలు కురిపించారు. ‘మాతో పొత్తు విషయంలో సోనియా గాంధీ, రాహుల్‌ గాంధీలు సానకూల వైఖరితోనే ఉన్నారు. బీఎస్పీతో పొత్తుకు ముందు నుంచీ వారు నిజాయితీగానే ప్రయత్నిస్తున్నారని మాయావతి వ్యాఖ్యానించారు. దీంతో కేవలం ఈ మూడు రాష్ట్రాల్లోనే కాంగ్రెస్‌తో పొత్తు తెంచుకున్నారా లేదా వచ్చే లోక్‌సభలో ఎన్నికల్లో కూడా మాయావతి ఇదే పంథా అనుసరిస్తారా అన్న అంశంపై సందిగ్ధత నెలకొంది.

సీబీఐ విచారణ భయంతోనే..!
తన తమ్ముడిపై సీబీఐ విచారణ జరుగుతుందన్న భయంతోనే మాయవతి బీజేపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని ఏఐసీసీ కార్యదర్శి దిగ్విజయ్‌ సింగ్‌ ఆరోపించారు. అందుకే ఆమె కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకోవడం లేదంటూ విమర్శించారు. కాగా దిగ్విజయ్‌ వ్యాఖ్యల్ని ఖండించిన మాయావతి... అతడు బీజేపీ ఏజెంట్‌ అంటూ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.

మరిన్ని వార్తలు