కశ్మీర్‌ పర్యటన; కాంగ్రెస్‌పై మాయావతి ఫైర్‌!

26 Aug, 2019 13:31 IST|Sakshi

విపక్ష బృందం కశ్మీర్‌ పర్యటనపై మాయావతి విమర్శలు

లక్నో : కశ్మీర్‌ పర్యటనకు వెళ్లిన విపక్ష బృందంపై బహుజన్‌ సమాజ్‌ పార్టీ(బీఎస్పీ) అధినేత్రి, యూపీ మాజీ సీఎం మాయావతి విమర్శలు గుప్పించారు. కశ్మీర్‌లో పరిస్థితులు సాధారణ స్థితికి రావాలంటే కొంతసమయం వేచి చూడాల్సి ఉందని అభిప్రాయపడ్డారు. కశ్మీర్‌ అంశాన్ని రాజకీయం చేసేందుకు బీజేపీ, కశ్మీర్‌ గవర్నర్‌ సత్యపాల్‌ మాలిక్‌కు మీరే అవకాశం ఇచ్చారంటూ విరుచుకుపడ్డారు. కశ్మీర్‌కు వెళ్లే ముందు ఒకసారి ఆలోచించాల్సిందని హితవు పలికారు. ఆర్టికల్‌ 370 రద్దు, రాష్ట్ర విభజన నేపథ్యంలో జమ్మూ కశ్మీర్‌లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయంటూ ప్రతిపక్షాలు విమర్శిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కశ్మీర్‌ గవర్నర్‌ వాటిని ఖండిస్తూ అవసరమైతే ఇక్కడికి వచ్చి చూడవచ్చని ప్రతిపక్ష నాయకులకు సూచించారు. అయితే అక్కడి అధికారులు మాత్రం వీరికి అనుమతి నిరాకరించారు. అయినప్పటికీ కాంగ్రెస్‌ ఎంపీ రాహుల్‌ గాంధీ ఆధ్వర్యంలో ఆర్జేడీ, ఎన్సీపీ, టీఎంసీ, డీఎంకే, సీపీఐ, సీపీఎం పార్టీలకు చెందిన పలువురు నేతలు శనివారం కశ్మీర్‌ పర్యటనకు వెళ్లారు. ఈ క్రమంలో వారిని శ్రీనగర్‌ ఎయిర్‌పోర్టులోనే అడ్డుకున్న అధికారులు తిరిగి వెనక్కి పంపించారు.

చదవండి‘వారి కష్టాలకు రాళ్లు కూడా కన్నీరు కారుస్తాయి’

ఈ విషయంపై స్పందించిన మాయావతి...‘ సమానత్వం, ఐకమత్యం, సౌభాతృత్వం, దేశ సార్వభౌమత పట్ల బాబా సాహెబ్‌ అంబేద్కర్‌ విశ్వాసం కలిగి ఉండేవారు. అందుకే జమ్మూ కశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్‌ 370కి ఆయన వ్యతిరేకం. ఈ కారణంగానే ఆ అధికరణ రద్దుకు బీఎస్పీ పార్లమెంటులో మద్దతు ప్రకటించింది. కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తర్వాత 69 ఏళ్ల అనంతరం దేశ రాజ్యాంగం ఇప్పుడే కశ్మీర్‌లో కూడా అమల్లోకి వచ్చింది. కాబట్టి అక్కడ పరిస్థితులు సాధారణ స్థితికి రావాలంటే కొంత సమయం పడుతుంది. కోర్టు కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తపరిచింది. ఇలాంటి పరిస్థితుల్లో కాంగ్రెస్‌ సహా మరికొన్ని పార్టీల నేతలు అనుమతి లేకుండా కశ్మీర్‌కు వెళ్లారు. కశ్మీర్‌ అంశాన్ని రాజకీయం చేసేందుకు కేంద్ర ప్రభుత్వానికి, అక్కడి గవర్నర్‌కు అవకాశం ఇచ్చింది మీరు కాదా? అక్కడికి వెళ్లేముందు కనీసం ఒక్కసారైనా ఆలోచించి నిర్ణయం తీసుకోవాల్సింది’ అని వరుస ట్వీట్లలో పేర్కొన్నారు. కాగా బీజేపీ సర్కారుపై తీవ్ర విమర్శలు చేసే మాయావతి.. ఆర్టికల్‌ 370 రద్దు విషయంలో మాత్రం కేంద్రానికి పూర్తి మద్దతు పలికిన విషయం తెలిసిందే.

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా