మోదీ నిజంగా వెనుకబడిన కులం వారేనా?

10 May, 2019 13:35 IST|Sakshi

ప్రధాని మోదీ వ్యాఖ్యలపై మండిపడ్డ మాయావతి

లక్నో : ఎన్నికల ప్రచారంలో భాగంగా బీజేపీ నేతలు ఉపయోగిస్తున్న భాష చూస్తుంటే వారికి ఓటమి భయం పట్టుకున్న విషయం అర్థమవుతోందని బీఎస్పీ అధినేత్రి మాయావతి అన్నారు. ఓడిపోతామని తెలిసే అర్థం పర్థంలేని ఆరోపణలు చేసి నవ్వులపాలవుతున్నారని ఎద్దేవా చేశారు. రెండోసారి ప్రధాని కావాలనుకుంటున్న నరేంద్ర మోదీ కలలు ఎప్పటికీ నెరవేరవని పేర్కొన్నారు. దేశంలోనే అత్యధిక లోక్‌సభ స్థానాలున్న ఉత్తరప్రదేశ్‌లో బీజేపీని ఓడించడమే లక్ష్యంగా ఒకప్పుడు బద్ధ శత్రువులైన ఎస్పీ-బీఎస్పీ ఈ లోక్‌సభ ఎన్నికల్లో కూటమిగా పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ కూటమి కులప్రాతిపదికన ఏర్పడినది అంటూ ప్రధాని నరేంద్ర మోదీ విమర్శించారు.

ఈ విమర్శలపై మాయావతి ట్విటర్‌ వేదికగా స్పందించారు. ‘ మా కూటమి కులం ఆధారంగా ఏర్పడిందనటం, కుల రాజకీయాలు చేస్తుందనడం హాస్యాస్పదం. అవివేకం. అపరిపక్వతకు నిదర్శనం. పుట్టుకతోనే నరేంద్ర మోదీ వెనుకబడిన కులానికి చెందిన వారు కాదు. కులం పేరిట జరిగే ఏ బాధను ఆయన అనుభవించలేదు. అలాంటి వ్యక్తి మా కూటమి గురించి ఇటువంటి వ్యాఖ్యలు చేయడం సరైనది కాదు. ఒకవేళ మోదీ నిజంగా వెనుకబడిన కులానికి చెందిన వారే అయితే ఆరెస్సెస్‌ ఆయనను ప్రధాని కానివ్వకపోయేది. కళ్యాణ్‌ సింగ్‌ వంటి నేతలను ఆరెస్సెస్‌ ఏం చేసిందో మనందరికీ తెలిసిందే కదా’ అని పేర్కొన్నారు. ఇలాంటి అనవసరపు విమర్శలు చేసే బదులు తన సొంత రాష్ట్రం గుజరాత్‌లో దళితుల పరిస్థితి ఎలా ఉందో ఓసారి తెలుసుకుంటే మంచిదని మోదీకి హితవు పలికారు. గుజరాత్‌లో దళితులపై అత్యాచారాలు పెచ్చుమీరాయని.. వీటి గురించి ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించారు.

మరిన్ని వార్తలు